ఏకగ్రీవంపై ఉత్కంఠ
తిరుపతి ఉప ఎన్నికపై వీడని సస్పెన్స్
నామినేషన్ వేసిన అధికార పార్టీ అభ్యర్థి సుగుణమ్మ
పోటీకి దూరమని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
ఎటూ తేల్చని కాంగ్రెస్, సీపీఎం
నామినేషన్లు వేసిన లోక్‌సత్తా, జనసంఘ్
ఇప్పటికే మొత్తం 9 మంది నామినేషన్లు
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఏకగ్రీవంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఏకగ్రీవానికి సహకరించాలని టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పలు దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. చర్చలు సైతం జరిపారు. టీడీపీ అభ్యర్థనతో ఉప ఎన్నికల బరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. జిల్లా నేతలతో చర్చించిన అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. దీంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఉపఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తామంటూ తొలుత ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత కొంత వెనక్కు తగ్గింది. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పింది. పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఎటూ తేల్చలేదు.
పోటీలో ఉండాలని కొందరు, పోటీకి దూరంగా ఉండాలని మరికొందరు పట్టుబడుతుండడంతో ఆ పార్టీ ఇప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది. ఇక ఉపఎన్నికల బరిలో నిలుస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో చర్చించింది. కానీ ఇంకా నిర్ణయం వెలువరించలేదు. పోటీ చేసే అవకాశం ఎక్కువని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక నామినేషన్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే లోకసత్తా,జనసంఘ్ తదితర పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్,సీపీఎంతో పాటు మిగిలిన వారు పోటీలో నిలిచే పక్షంలో తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక రసకందాయంలో పడనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రగిలింది. మున్ముందు ఎవరు బరిలో నిలుస్తారో...? ఆయా రాజకీయ పార్టీలు ఏమీ నిర్ణయం తీసుకుంటాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికీ రెండుమార్లు ఉపఎన్నికలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ తిరుపతితో పాటు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలుపొందారు. ఆయన గుడివాడ వైపు మొగ్గు చూపడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో తిరుపతికి ఉపఎన్నిక జరిగింది. తాజాగా వెంకటరమణ మృతితో తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక జరుగుతోంది.
ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ జనవరి 12 షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ తుది గడువు, 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది, 16న ఓట్ల లెక్కింపు తంతు ముగియనుంది. 18 నాటికి ఎన్నికల కోడ్ ముగియనుంది.