‘ఏకగ్రీవ’ ఎత్తుగడ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏకగ్రీవానికి అధికార పార్టీ అడ్డదారులు
ఇతరులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న నాయకులు
కలెక్టరేట్ ఎదుటే స్వతంత్ర అభ్యర్థులపై దాడులు
మాట వినని వారిని కిడ్నాప్ చేసి బెదిరింపు
ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న జిల్లా టీడీపీ నేతలు
చిత్తూరు, సాక్షి: జిల్లానుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ దౌర్జన్యకాండకు దిగింది. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకగ్రీవం కావాలని చేసిన ప్రయత్నంలో విజయం సాధించినా ప్రజాస్వామ్యం మాత్రం అపహాస్యం పాలైంది. దీనిపై ‘మునుపెన్నడూ నేను ఇలాంటి సంఘటనలు చూడలేదు’ అని స్వయంగా ఎన్నికల పరిశీలనాధికారి అనంతరాములు వ్యాఖ్యానించడం విశేషం.
ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కారు. కొంతమందిపై భౌతికదాడులకు పాల్ప డ్డారు. ఒక్క నామినేషన్ కూడా పడకూడదనే లక్ష్యంతో ఇద్దరిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం నామినేషన్ వేయడానికి వచ్చిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐల సమక్షంలోనే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. పోలీసుల రక్షణలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావుపై దాడిచేశారు. నామినేషన్ పత్రాలు చింపేశారు. ఈ దాడిలో పోలీసు వాహనం అద్దం కూడా పగిలిపోయింది. తిరుపతికి వెళ్లే సమయంలో ఆయనను కిడ్నాప్ చేశారు. పీలేరు నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన భానుప్రకాష్ అనే అభ్యర్థి నుంచి పోలీసుల ముందే నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భానుప్రకాష్‌ను పోలీసులు రిటర్నింగ్ ఆఫీసులోకి అనుమతించలేదు. భానుప్రకాష్ విద్యార్హత పత్రాలు కూడా టీడీపీ నాయకులు చింపేశారు.
సామాన్యులపై కూడా ప్రతాపం..
టీడీపీ కార్యకర్తలు సామాన్యులనూ వదిలిపెట్టలేదు. అధికారులతో కలవడానికి వచ్చిన వారిచేతిలో సంచి ఉంటే చాలు గుంజుకుని పరిగెత్తారు. పౌరసరఫరాల శాఖ అధికారులను కలవడానికి పీలేరు నుంచి వచ్చిన గౌరయ్య అనే డీలరు చేతిలో సంచి ఉండటంతో గుంజుకుని ఆయనపై దాడికి పాల్పడ్డారు. సంచిలో ఉన్న ఈ–పాస్ మిషన్‌ను పగులగొట్టారు. పట్టభద్రుల అభ్యర్థులకు కలెక్టరేట్‌లో సమావేశం ఉండటంతో కరీముల్లా అనే వ్యక్తి వచ్చారు. ఆయన చేతిలోని కాగితాలను నామినేషన్ పత్రాలుగా భావించి వాటిని చింపేశారు. వాటిలో విద్యార్హత పత్రాలు ఉండటంతో లబోదిబోమనడం కరీముల్లా వంతయింది. ఈ సంఘటనలన్నీ పోలీసుల కళ్లెదుటే జరుగుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడంతో సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారు.
బరిలో టీడీపీ అభ్యర్థి ఒక్కరే
జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో టీడీపీ అభ్యర్థి దొరబాబు ఒక్కరే మిగిలారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యకాండతో చిత్తూరులో కలెక్టరేట్ వద్దకు వెళ్లాలంటేనే భయపడే వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి కాకుండా మరో నలుగురు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో స్వతంత్ర అభ్యర్థులు మస్తాన్‌రెడ్డి, చంద్రమౌళి తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా అఫిడవిట్‌పై జుడిషియల్ స్టాంప్ లేకపోవడంతో వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు మాధవరావు నామినేషన్‌ను, ఫామ్26ను సరిగా పూర్తి చేయకపోవడంతో వెంకటరామి రెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో టీడీపీ అభ్యర్థి దొరబాబు మాత్రమే బరిలో నిలిచారు.