విజేత సుగుణమ్మ
తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల్లో
టీడీపీ అభ్యర్థికి 1,16,524 ఓట్ల మెజార్టీ
కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు
నోటాకు 2,152 ఓట్లు
తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి మన్నూరు సుగుణమ్మ 1,16,542 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సహా మిగిలిన స్వతంత్య్ర అభ్యర్థులకు డిపాజిట్ దక్కలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో పోటీచేయకపోవడంతో ఓటింగ్‌పై ప్రజల్లోనూ పెద్దగా స్పందన కనిపించలేదు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించకుండా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పోలింగ్‌రోజున ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు, పోలీసుల సహాయంతో టీడీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంది. దీనికితోడు సానుభూతి ఓట్లు తోడవడంతో ఉహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభం నుంచి చివరివరకు తెలుగు దేశం అభ్యర్థికి భారీ మొజార్టీ వచ్చింది. ఏ రౌండ్‌లోను కాంగ్రెస్ అభ్యర్థికి అశించిన స్థాయిలో ఓట్లు మాత్రం రాలేదు. గత ఎన్నికల్లో 2,650 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో కొంతమేర ఓట్లు పెరిగాయనే తృప్తి మాత్రమే మిగిలింది. లోక్‌సత్తా అభ్యర్థి కల్లూరి బాల సుబ్రమణ్యం, పోతిరెడ్డి వెంకటరెడ్డి కొంతమేరకు ప్రభావం చూపగలిగారు. మిగిలిన పది మంది అభ్యర్థులకు 500 ఓట్లు వరకు రావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తిరస్కరిస్తూ 2,152 మంది నోటాను వినియోగించుకున్నారు.
భారీ ఏర్పాట్లు
కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాక ముందే కౌంటింగ్ కేంద్రంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పోలీసులు క్షమాపణ చెప్పే వరకు కౌంటింగ్‌లో పాల్గొనేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య అధికారులకు నచ్చజెప్పడంతో సమస్య పరిష్కరమైంది. దీంతో కాస్త ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల పరిశీలకుడు హర్షదీప్ కాంబ్లే పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు సాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ లెక్కింపును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మధ్యలో వచ్చిన సుగుణమ్మ
ఓట్ల లెక్కింపు ముందే కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని లెక్కింపును పర్యవేక్షించారు. తెలుగుదేశం అభ్యర్థి తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకుని మధ్యలో వచ్చారు. చివరి రౌండ్ కౌంటింగ్ తరువాత 1,16,524 ఓట్ల మెజారిటీతో సుగుణమ్మ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య ప్రకటించారు. అనంతరం ఎమ్యెల్యేగా ఎన్నికైనట్లు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు.టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు.