తిరుపతి స్మార్ట్ సిటీ ?
- సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
- కార్పొరేషన్, తుడా అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్
తిరుధామం ఇక సుందర నగరంగా రూపుదిద్దుకోనుందా? ఆధ్యాత్మిక నగరంలో ఇకపై ‘ట్రాఫిక్’ ఉండదా? తాగడానికి సురక్షితమైన మంచినీళ్లు అందరికీ అందుబాటులోకి వస్తాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడంపై శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో కలెక్టర్ సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించడం ఇందుకు మరింత బలం చేకూర్చుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి/ తిరుపతి కార్పొరేషన్ : దేశంలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఇందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.7,060 కోట్లను కేంద్రం కేటాయించిన విషయం విదితమే. ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను ఆదేశించారు.
దాంతో శుక్రవారం తిరుపతికి చేరుకున్న కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మెప్మా పీడీ నాగపద్మజ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వీరారెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయడానికి డీపీఆర్‌ను రూపొందించే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి.
స్మార్ట్ సిటీ అంటే..
2050 నాటికి తిరుపతిలో పెరిగే జనాభా.. భక్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆ ప్రజల అవసరాలు తీర్చేలా డీపీఆర్‌ను రూపొందించి కేంద్రానికి పంపనున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెద్దపీట వేయనున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్లై ఓవర్ల నిర్మాణంతోపాటు మెట్రో రైలు వంటి వాటిని ప్రవేశపెట్టనున్నారు.
డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తారు. ఎక్కడైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు పగిలిపోయి.. మ్యాన్‌హోల్స్ ఓపెన్ అయినా తక్షణమే కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించేలా సాంకేతిక వ్యవస్థను అనుసంధానం చేస్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అవుటర్ రింగ్ రోడ్డును ఏర్పాటుచేయనున్నారు. భద్రతకోసం అధునాతన పోలీసు విధానాన్ని ప్రవేశపెడతారు.
కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతారు. నగర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సంప్రదాయేతర ఇంధన వనరులు(పవన విద్యుత్, సౌర విద్యుత్)కు పెద్దపీట వేస్తారు. వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా మార్చుతారు.. వ్యర్థ జలాలను ప్రాసెసింగ్ ద్వారా మంచినీటిగా మార్చుతారు. ఆ నీటితో కూరగాయలు పండించి నగర ప్రజలకే విక్రయిస్తారు. ఇలా అన్ని రంగాల్లోనూ నగరాన్ని అభివృద్ధి చేస్తారు.
పన్నుల మోతే..
స్మార్ట్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తే ప్రజల సమస్యలైతే పరిష్కారం అవుతాయి. కానీ.. పన్నుల మోత మోగడం ఖాయం. ఎందుకంటే.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపట్టనున్నారు. తాగునీటి సరఫరా దగ్గర నుంచీ ట్రాఫిక్ సిగ్నల్స్.. రహదారుల నిర్వహణ వరకూ ప్రతి అంశం ప్రైవేటు సంస్థలతో ముడిపడి ఉంటుంది. ప్రజలకు చేసిన సేవలకు ప్రతిఫలంగా యూజర్ చార్జీలు, వివిధ రకాల పన్నుల రూపంలో ప్రైవేటు సంస్థలు పిండుకోవడం ఖాయం.
ఇందుకు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలోనే బీజం పడటం గమనార్హం. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన డీపీఆర్‌ను రూపొందించే పనిని టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఆ సంస్థ రూపొందించే డీపీఆర్‌ను కేంద్రానికి పంపనున్నారు. ఆ డీపీఆర్‌పై కేంద్రం ఆమోదం వేశాక.. ఆ ప్రాజెక్టు అమలుకు టెండర్లు పిలుస్తుంది. ఈ టెండర్లలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును చేజిక్కించుకున్న ప్రైవేటు సంస్థ నగరాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిఫలంగా ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో పిండుకోనుందన్న మాట..!