తోటకూర అని తీసేయొద్దు..
- ఆకుకూరలతో లాభాలసాగు
- తక్కువ సమయంలో పంట దిగుబడి
- ఏడాదంతా చక్కటి ఆదాయం
చౌకగా దొరికే మేలైన పోషకాల మేళవింపు తోటకూర. శరీరానికి అవసరమైన కీలక పోషకపదార్థాలు దీని నుంచి పొందవచ్చు.అన్ని వయస్సుల వారు రోజుకు 50 నుంచి 70 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. అయిదు మొక్కల కట్ట రూ.3లకు ధర పలుకుతోంది. కేవలం 20 రోజుల్లో కోతకు వస్తుంది. రూ. 2వేల పెట్టుబడితో రూ. పదివేల ఆదాయాన్ని జిల్లాలోని రైతులు పొందుతున్నారు.
ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. రక్త పుష్టికి ఇనుము,ఎముకుల గట్టితనానికి సున్నం, కండరాల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన పొటాషియం, జింక్, కంటి ఆరోగ్యానికి విటమిన్-ఎ వంటి అనేక పోషకాలు తోటకూర నుంచి లభిస్తాయి. సాధారణ పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో నామమాత్రపు పెట్టుబడితో ఆకుకూరలు చేతికి అందుతాయి. చక్కటి ఆదాయం సమకూరుతుంది. అన్ని కాలాల్లోనూ పండిస్తారు. జిల్లాలో సుమారు 70 నుంచి 100 హెక్టార్లలో దీనిని సాగు చేస్తున్నారు. చోడవరం మండలం నర్సాపురం, రావికమతం మండలం తోటకూరవానిపాలెంతో పాటు కె. కోటపాడు, అనకాపల్లి, పెందుర్తి, సబ్బవరం, ఆనందపురం కశింకోట మండలాలలో అధికంగా సాగు చేస్తున్నారు. విశాఖకు సమీపంలో ఉన్న పెందుర్తి ప్రాంతంలో అధిక శాతం ఆకుకూరల సేద్యం ఉండడం గమనార్హం.
చక్కటి ఆదాయం..
విత్తనం వేసిన నాటి నుంచి నాలుగు సార్లు మాత్రమే నీరు అందించాలి. ఈ దశలో సేంద్రియ ఎరువులతో పాటు యూరియా కూడా వేస్తే పంట తొందరగా చేతికందుతుంది. పంట వేసిన 30 రోజుల్లో తీస్తే ఆరోగ్యకరమైన లేత కూర లభిస్తుంది. దీంతోపాటు గోంగూర కూడ 20 రోజులకే కోసుకోవచ్చు. ఇక పాలకూర, బచ్చలికూర, చుక్కకూర నెల రోజులకు అందుబాటులోకి వస్తుంది. పుదీనా, కొత్తిమీర 40 రోజులకు ఎదుగుతుంది. కేవలం రూ.2వేల పెట్టుబడితో రూ.10 వేలు సంపాదించొచ్చు.
ఇదే జీవనాధారం
నాది చింతల అగ్రహారం. మాకు తొలినాళ్ల నుంచి ఇదే జీవనాధారం. ఆకుకూరల పెంపకం, వ్యాపారం లాభదాయకంగానే ఉంది. పండించిన తోటకూరను రైతు బజారులకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. రోజుకు కనీసం రూ.3 వందలకు తోటకూర అమ్ముతాను. ప్రతి నెలా రూ.10వేలు ఆదాయం వస్తోంది. నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నాను.
- వరహాలమ్మ, రైతు
అన్ని నేలలు అనుకూలం
తోటకూరను అన్ని నేలల్లోనూ సాగు చేయవచ్చు. ఎకరాకు రెండు నుంచి మూడు కిలోల విత్తనం అవసరముంటుంది. వాస్తవానికి వైట్, రెడ్ అమరాంత్రస్ రకాలు వినియోగంలో ఉన్నా జిల్లాలో తెలుపు రకాన్ని ఎక్కువుగా సాగు చేస్తున్నారు. ఎకరా విత్తనం రూ.150లు. ఉద్యాన శాఖ 50 శాతం రాయితీపై రైతులకు అందిస్తోంది. తోటకూర సాగులో పశువుల గెత్తం అవసరం అధికంగా ఉంటుంది. తోటకూరను అధికంగా ఆకుతినే పురుగు, పేను ఆశిస్తాయి. వీటి నియంత్రణకు రసాయనిక మందులు కాకుండా వేపనూనె వాడాలి. నల్లబజారులో కంటే ప్రభుత్వం వద్దే విత్తనాలు కొనుగోలు చేయడం మంచిది.
- కె.శ్యామల,ఉద్యానశాఖ అధికారి
83744 49976
ఆదాయం బాగుంది
నాది పినగాడి గ్రామం. పూర్వకాలం నుంచి ఆకుకూరలు పండిస్తున్నాం. వీటికి డిమాండ్ ఎక్కువ. తోటకూరతో పాటు చుక్కకూర, పాలకూర కూడా పండిస్తాం. ఎకరాకు రూ.2 వేలు పెట్టుబడి అవుతోంది. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులనే వాడుతాం. ఒక్కసారి మాత్రమే యూరియా వేస్తాం. 20 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు నీరు పెడతాం. వర్షాలు పడితే ఆ శ్రమ ఉండదు. వారానికి ఒకసారి కలుపు తీయాలి. అప్పుడే నాణ్యమైన కూర వస్తుంది. తాజాగా, లేతగా ఉండాలంటే 30 రోజుల లోపు తీసేయాలి. ఎకరాకు రూ.10 నుంచి రూ.15వేల వరకు ఆదాయం వస్తోంది.
- దాడి అప్పలనాయుడు, రైతు(93968 70138)
పెట్టుబడి తక్కువ
నాది చింతల అగ్రహారం. తక్కువ పెట్టుబడితో ఆకుకూరలు పండించుకోవచ్చు. సేంద్రియ ఎరువులు తగిన మోతాదులో వాడితే ఇతర రసాయన ఎరువులు అక్కరలేదు. పంట ఎదగడానికి కొద్ది మొత్తంలో యూరియా వేస్తే చాలు. మార్కెట్‌లో తోటకూర, గోంగూరకు అధిక డిమాండ్ ఉంది. అయిదు మొక్కల కట్ట రూ.3లకు అమ్ముడుపోతోంది. మిగతా పంటల కంటే దీని సాగుతో ఆదాయం బాగుంది. విశాఖనగరానికి తీసుకెళ్లడానికి బస్సు సదుపాయం కల్పిస్తే బాగుంటుంది.
- కుమారి, మహిళా రైతు