![Titli Cyclone Victims Protest Against AP Government - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/14/srikakulam-district.jpg.webp?itok=WWMwizre)
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో టిట్లీ తుఫాను బాధితులు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్నారు. టిట్లీ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయటంలేదని ఆగ్రహిస్తూ.. బాధితులు ఆందోళన బాటపట్టారు. ఉద్దానం, పాతపట్నం, కొత్తూరు, పలాస ప్రాంతాలకు చెందిన తుఫాను బాధితులు ఆదివారం ఉద్యమ బాట పట్టారు. తుఫానుతో ఛిన్నాభిన్నమైన తమ ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని, ఆహారం, తాగునీరు లేక తాము ఆకలితో అలమటిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడని, అధికారులు కనీసం వరదనష్టాన్ని అంచనా వేయడానికి కూడా గ్రామాలకు రావడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.
తుఫాన్‌తో తమ జీవితాలు అతలాకుతలం అయ్యాయని, తినడానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా లేవని, అధికారులు సైతం తమను పట్టించుకోవటం లేదని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొత్తూరు మండలంలోని జంక్షన్ వద్ద ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజలు.. తహశీల్దార్‌ను నిర్బంధించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు రోడ్డుపై భైఠాయించటంతో రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
పాతపట్నంలో...
తుఫాను బాధితులు ఆందోళనకు దిగడంతో పాతపట్నం ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టించిన బాధితులు.. తుఫాను విధ్వంసం సృష్టించి నాలుగు రోజులు అవుతున్నా.. తమ గ్రామాల్లో అధికారులు కనిపించడం లేదని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు మంచినీరు, ఆహారం కల్పించాలని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేశారు.
సున్నదేవి సెంటర్‌లో..
సున్నదేవి సెంటర్‌లోనూ తుఫాను బాధితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పలాస-మందస రహదారిపై బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో హైవేపై పెద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, తుఫానుతో అష్టకష్టాలు పడుతున్న తమను అధికారులు ఆదుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment