కామారెడ్డి, న్యూస్‌లైన్ : అవి మలిదశ తెలంగాణ రాష్ర్ట సాధనోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిరవధిక దీక్షకు దిగుతానని ప్రకటించారు. ముహూర్తం నిర్ణయించారు. 2009 నవంబర్ 29 నుంచి మెదక్ జిల్లా సిద్ధిపేటలో నిరశన చేపడతానన్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది. కేసీఆర్ దీక్షా స్థలికి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి, ఆస్పత్రికి తరలించారు. ఇక తెలంగాణ రాదేమోనని ఆందోళన చెందిన భిక్కనూరుకు చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య 30వ తేదీ రాత్రి కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కాడు. తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకం కావాలనుకున్నాడు.
తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బుజ్జగించారు. భార్యాపిల్లలను రప్పించి మాట్లాడించారు. అయినా కిష్టయ్య తన పంతం వీడలేదు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని మరణించాడు. తెలంగాణ రాష్ర్టం వస్తేనే బతుకులు బాగుపడతాయని ఆయన తన మరణ వాంగ్మూలంగా రాసుకున్న లేఖలో పేర్కొన్నారు. కిష్టయ్య బలిదానంతో తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైంది. ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొని, నివాళులర్పించారు. ఆనాటి నుంచి కామారెడ్డిలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కిష్టయ్య స్మారకార్థం కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో స్థానిక ముదిరాజ్ సంఘం నేతలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ఏ కార్యక్రమం జరిగినా కిష్టయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.
‘రాష్ట్రం’ కోసం తుపాకీతో కాల్సుకున్నడు
Published Sat, Feb 22 2014 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement