సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి గడ్డ నెలరోజులకు పైగా సమైక్య నినాదాలతో దద్దరిల్లుతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రజా సంఘాలు, అధికారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు సమైక్య గళం వినిపిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో సమైక్య సింహగర్జన నిర్వహిస్తున్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఈ గర్జన ఏర్పాట్లలో జిల్లా అధికారుల సంఘం ప్రధాన భూమిక పోషిస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో సింహగర్జన కీలక ఘట్టం కాబోతోంది.
జిల్లా వ్యాప్తంగా ఇంటికొకరు అనే పిలుపుతో సింహగర్జన నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ గర్జన సభకు సమైక్యవాదులు ఎవరైనా హాజరు కావచ్చని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నలుమూలల నుంచి రెండు లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. సభకు వస్తున్న సమైక్యవాదులు ఇబ్బంది పడకుండా సభాప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సమైక్యవాదం తెలియజేస్తూ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు ఏడడుగల ఎత్తులో 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు ఉండేలా వేదిక నిర్మాణం జరిగింది. తొక్కిసలాట, తోపులాట జరగకుండా పకడ్బందీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడంటే అక్కడ నిలిపివేయకుండా పార్కింగ్‌కు చర్యలు తీసుకున్నారు. నగర ప్రజలు ఏసీ స్టేడియం చేరుకునేందుకు వీలుగా ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఏసీ స్టేడియం వరకు రవాణా శాఖ అధికారులు కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు. వీటిలో ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో పెద్ద ఎత్తున మంచినీటి సౌకర్యం కల్పించారు. కేవలం ముగ్గురు వక్తలకు మాత్రమే ప్రసంగించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఈ ప్రదర్శనలు ఉంటాయి.