ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయనేది బహిరంగ రహస్యమే. రూ.ఐదు వేల నగదు, వెండి గ్లాసులు, బంగారు ఉంగరాలు, టాబ్లెట్ పీసీలు, సెల్‌ఫోన్లు, వగైరాలతో కొందరి మాస్టార్ల ఓట్లు అంగట్లో సరుకులుగా మారిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో వేలం మాదిరిగా ఉపాధ్యాయుల ఓట్ల విక్రయాలు బాహాటంగానే జరిగిపోతున్నాయి. అయితే, ఎన్ని తాయిలాలు ఇచ్చినా.. ఎంత డబ్బు పంచినా గెలుపు మీద నమ్మకం లేని కార్పొరేట్ శక్తులు చివరకు ఉపాధ్యాయులను బెదిరింపులకు గురి చేస్తున్నాయట. అధికార పార్టీ బహిరంగ మద్దతుతో హల్‌చల్ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫు అనుచరులు ప్రచారంలో చివరి అంకంగా దాదాగిరీని ఎంచుకున్నారట.
ముందు నోట్లకట్టలు విచ్చలవిడిగా పంచిన సదరు అభ్యర్థి అనుచరులు చివర్లో ‘మీరు ఓట్లు వేయకుంటే అంతే సంగతులు’ అని మాస్టార్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంటున్నారు. ‘ప్రభుత్వం మాదే. పొరపాటున మేం కాకుండా ఎవరైనా గెలిచారా. మీ అందరి జాతకాలు మావద్ద ఉన్నాయి. ఒక్కొక్కరి అంతు తేలుస్తాం’ అని రెండురోజుల నుంచి నేరుగా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సొమ్ములు పంచుతున్నారన్న మరక తమతోపాటు బరిలో ఉన్న అందరికీ అంటించాలన్న దురుద్దేశంతో ప్రత్యర్ధుల తరఫు కూడా కొంతమందికి సదరు అభ్యర్థి నోట్లు పంచారట.
‘పోటీ లో ఉన్న ఫలానా మాస్టారు పంపించా రు. ఇతరుల మాదిరి ఎక్కువ ఇచ్చుకోలేక వెయ్యితో సర్దుకోమన్నారు’ అంటూ కొంతమందికి రూ.వెయ్యి నోట్లు పంచారట. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇన్ని జిమ్మిక్కులు.. ఇన్ని చిల్లర వేషాలు చూడలేదని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారంటే ప్రలోభాలు, బెదిరింపులు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ప్రభు త్వ విద్యారంగాన్ని కాపాడటం కోసం కార్పొరేట్ శక్తులు రూ.కోట్లు ఖర్చుచేసి ఓట్లు దండుకోవాల్సిన అవసరం ఏముం ది? ఈ రోజు ఓటు హక్కు వినియోగించే ఉపాధ్యాయుల్లో ఈ ఒక్క ప్రశ్న ఉదయిస్తే చాలు. డబ్బుతో గెలుపు గుర్రం మీద స్వారీ చేయొచ్చని విర్రవీగుతున్న కార్పొరేట్ శక్తుల ఆశలు తలకిందులవుతాయి. మరి మాస్టార్లు ఏ మేరకు విజ్ఞత చూపిస్తారో చూడాల్సిందే.!
‘అంబికా’ కథ అంతేనా
ఎమ్మెల్సీ ఆశలు గల్లంతు అంబికా కృష్ణ రాజకీయ భవితవ్యం ఓ విధంగా ప్రశ్నార్థకంగానే తయారైంది. వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఆయన ముద్ర ఏలూరు నగరం మీద ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే పవర్‌లో ఉంటేనే ఎవరికైనా విలువ. కానీ ఇప్పుడు ఆ ‘పవర్’ ఆయనతో దోబూచులాడుతోంది. గత ఎన్నికల సమయాన సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో బడేటి బుజ్జికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో టీడీపీ వాణిజ్య సెల్ నాయకుడి హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి తన సామాజికవర్గ ఓటర్లను టీడీపీ వైపు మళ్లించేందుకు ఆయన శక్తిమేర ప్రయత్నించారు. నందమూరి బాలకృష్ణ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో కూడా వీరభద్ర వంటి భారీ సిని మా తీసిన నేపథ్యం ఉండటంతో బాలయ్య మద్దతు అంబికా కృష్ణకే ఉంటుందని ఆశిం చారు. అటు పార్టీకి చేసిన సేవ.. ఇటు బాలయ్య మద్దతు నేపథ్యంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానంతనదేనని అంబికా కృష్ణ ధీ మాగా ఉన్నారు. కానీ సరిగ్గా ఎమ్మె ల్సీ కేటాయింపుల వేళ ఈయనకు ఆశాభంగమే మిగిలింది. నమ్మిన వారికి మేలు చేయని, ఆశించిన వారి కి అందలం ఎక్కించని బాబు వ్యవహార శైలితో అంబికా కృష్ణ కంగుతిన్నారు. అసంతృప్తి ఉన్నా ఇప్పటికిప్పుడు బయటపడితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు. కార్పొరేషన్ పదవుల పందేరంలోనైనా తనకు సముచిత స్థానం దక్కుతుందన్న ఆశతో చివరకు తనను తానే ఊరడించుకున్నారని అంటున్నారు. అంటే అప్పటివరకు అంబికా కృష్ణ ముందున్న కర్తవ్యం.. వేచి వేచి.. చూసి చూసి...!
పచ్చచొక్కాల సేవలో పౌర సంబంధాల శాఖ
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధికారుల పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలియజేయడం.. వెరసి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా పనిచేయడం పౌర సంబంధాల శాఖ అధికారుల విధి. కానీ జిల్లా పౌర సంబంధాల శాఖలోని కొందరు మాత్రం టీడీపీ కార్యకర్తల మాదిరి పనిచేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ఓ ఘటనే. ఈ మధ్యనే జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమ కవరేజీని భుజానకెత్తుకున్న సమాచార శాఖ అధికారి ఒకరు పత్రికల వారికి ఫోన్‌చేసి ‘ఫలానా నాయకుడి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఫొటోలు పంపిస్తున్నాం. బాగా కవర్ చేయండి’ అని సిఫార్సు చేశారు. ‘అదేంటి.. ఆ కార్యక్రమ కవరేజికి మీకు ఏం సంబం ధం. వాళ్ల ఫొటోగ్రాఫర్లు, వ్యక్తిగత సిబ్బంది ఉంటారు కదా’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే.. ‘అబ్బే ఊరకే ఫోన్ చేశాను. మీ ఇష్టం’ అంటూ ఫోన్ పెట్టేశారు. ఇదండీ మన పశ్చిమ పౌర సంబంధాల శాఖ అధికారుల పనితనం.
- జి.ఉమాకాంత్,
సాక్షి ప్రతినిధి, ఏలూరు
మాస్టార్ల మేలుకొలుపు
Published Sun, Mar 22 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement