సైబర్ నేరాలపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ
రాష్ట్రంలోని పోలీస్ అధికారులు హాజరు
కేఎల్ యూనివర్శిటీ వేదిక
ఒక్కో జిల్లా నుంచి సీఐ, ఎస్సైతోపాటు నలుగురు సిబ్బంది
పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆన్‌లైన్ మోసాలను పోలీస్ శాఖ ఎట్టకేలకు సీరియస్‌గా తీసుకుంది. సైబర్ క్రైం పోలీసుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ఏర్పాటుచేసిన రెండురోజుల శిక్షణ తరగతులు శుక్రవారం కేఎల్ యూనివర్శిటీలో ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ ఆధునిక పరిజ్ఞానంలోని మెలకువలను ఈ తరగతుల్లో పోలీసులకు నేర్పించనున్నారు.
సాక్షి, గుంటూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రకరకాల మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దొంగలు, ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లు, చీటర్ల గుట్టురట్టు చేస్తున్న పోలీసులు సైబర్ నేరాల విషయంలో మాత్రం వెనకబడి ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వెబ్‌లు, సెల్‌ఫోన్ మెసేజ్‌లు, హ్యాకింగ్‌లు వంటి వాటి ద్వారా రాష్ట్రంలో రోజుకు వేల సంఖ్యలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల దృశ్యాలను నెట్‌లో, యూట్యూబ్ ద్వారా, ఫేస్‌బుక్‌ల ద్వారా అప్‌లోడ్ చేయడం వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వీటిని వెంటనే నిలిపివేయడం పోలీసులకు కష్టంగా మారింది.
అదో పెద్ద ప్రహసనం
ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. అసభ్యకర, అభ్యంతరకరమైన పోస్టింగ్‌లను ఎక్కువ మంది చూడకుండా బ్లాక్ చేయాలంటే జిల్లా పోలీస్ అధికారి తన లెటర్‌హెడ్ ద్వారా ఆయా సంస్థలకు లేఖ రాయాలి. పట్టణాల్లో ఉండే వారి వ్యవహారాల్లో ఎస్పీలు కలగజేసుకుని పరిస్థితి చక్కదిద్దుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరిగితే బ్లాక్ చేయడానికి సుమారు 10 రోజుల సమయం పడుతుంది. ఈలోపే ఫేస్‌బుక్ లైక్‌లు, షేర్‌ల ద్వారా ప్రపంచం మొత్తం ఆ పోస్టింగ్‌లు పాకిపోతున్నాయి. దీనిపై పోలీసులకు సైతం అధికారాలు నామమాత్రంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థికపరమైన మోసాలు, హ్యాకింగ్‌లు, లాటరీ తగిలిందంటూ సెల్‌ఫోన్లకు వచ్చే మెసేజ్‌లు ఎవరు పంపారు, వారిని ఎలా గుర్తించాలనేది తేల్చడం పోలీసులకు ప్రహసనంగా మారింది. వీటిని అరికట్టడానికి పోలీసులకు సైబర్ నేరాలపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల శిక్షణ
సైబర్ నేరాలపై ప్రాథమికంగా ఎలా విచారణ చేపట్టాలి అనే అంశాలపై హైదరాబాద్‌లోని ఈఎస్‌ఎఫ్ ల్యిబ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిలోని కేఎల్ యూనివర్శిటీలో రెండు రోజులు జరగనున్న ఈ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సైబర్ నేరాలు, మోసాలు జరిగినప్పుడు సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్‌లో ఉండే డేటా పోకుండా ఎలా సీజ్ చేయాలి అనే దానిపై ఈఎస్‌ఎఫ్ ల్యాబ్ ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. ప్రతి జిల్లా నుంచి సీఐ, ఎస్సైతోపాటు నలుగురు పోలీస్ సిబ్బంది ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణ వల్ల సైబర్ నేరాలను ఛేదించడంలో పోలీసులకు మెలకువలు నేర్పే ప్రయత్నం చేస్తున్నట్లు ల్యాబ్ ప్రతినిధి అనిల్ ‘సాక్షి’కి తెలిపారు.
ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట
Published Sat, Nov 28 2015 1:58 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement