గుంటూరు జిల్లా మందడంలో రాజధాని భూమిపూజకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
* ఉదయం 8.49 గంటలకు ముహూర్తం
* సతీసమేతంగా హాజరవుతున్న సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని(అమరావతి) నిర్మాణంకోసం శనివారం జరగనున్న భూమిపూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 8.49 గంటలకు వేదపండితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.
భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలసి హాజరవుతున్నారు. ఉదయం 7.15 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 7.55కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో 8.15 గంటలకు తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చేరుకుంటారు. ఆ తరువాత 9.30 గంటలవరకు కొనసాగే భూమిపూజలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారని జిల్లా అధికారవర్గాలు తెలిపాయి.
తుళ్లూరు మండలం మందడం గ్రామ హద్దుల్లోని సర్వే నంబరు 135, 136లలోని పొలాలను రాజధాని నగర నిర్మాణ పనుల భూమిపూజకు అనువైనదిగా ఎంపిక చేయడం తెలిసిందే. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజాము 3 గంటలకే పూజలు ప్రారంభించనున్నారు. ఇందుకోసం 9 మంది వేదపండితులను రప్పించారు.
పూజ తర్వాత హలయజ్ఞం...
సరిగ్గా శనివారం ఉదయం 8.49 గంటలకు నిర్దేశిత ప్రదేశంలో సీఎం చంద్రబాబు దంపతులు భూమిపూజ నిర్వహిస్తారు. అనంతరం నాగలి పట్టి హలయజ్ఞం నిర్వహిస్తారు.
నేడు క్యాంప్ ఆఫీస్ సందర్శన...
మందడంలో భూమిపూజ ముగిశాక సీఎం దంపతులు హెలికాప్టర్‌ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నీటిపారుదలశాఖ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లోనే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుని అక్కడినుంచి విశాఖపట్నం వెళతారని అధికారవర్గాలు తెలిపాయి.