నేటితో బీఎస్‌ఎన్‌ఎల్ ఎన్నికల ప్రచారానికి తెర
► రేపు జిల్లా వ్యాప్తంగా యూనియన్ల గుర్తింపు ఎన్నికలు
► 12 మధ్యాహ్నానికి ఫలితాలు
తిరుపతి అర్బన్: దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లోని వివిధ ఉద్యోగ సంఘాలకు జరగనున్న గుర్తింపు ఎన్నికల ప్రచారం సోమవారం ఉదయం 9 గంటలతో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 10 సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయాల పరిధిలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 19 యూనియన్లు పోటీలో నిలుస్తుండగా, చిత్తూరుజిల్లాలో మాత్రం కేవలం 5 యూనియన్లే పోటీలో ఉన్నాయి.
వాటి లో ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్(బీఎస్‌ఎన్‌ఎల్ ఈ యూ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికం ఎంప్లాయిస్(ఎన్‌ఎఫ్‌టీఈ)ల మధ్యే పోటీ నెలకొననుంది. జిల్లాలో మొత్తం 757 మంది ఉద్యోగులు, కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలను 12వ తేదీ మధ్యాహ్నానికి ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. గత 14 ఏళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో జరుగుతున్న ఈ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే విజయపథంలో నిలబడి ఏకైక గుర్తింపు సంఘంగా పేరు తెచ్చుకుంది. ఆ క్రమం లో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కూడా కొన్ని ప్రాంతాల్లో గట్టిపోటీని ఇస్తోందని బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు వె ల్లడిస్తున్నాయి.
పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు
బీఎస్‌ఎన్‌ఎల్ సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియ నెలన్నర క్రితమే జిల్లా లో ఆరంభమైనప్పటికీ గత వారం రోజుల నుంచి తిరుపతితో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో యూనియన్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. యూనియన్లు తమ తమ ఎన్నికల గుర్తులను, సీరియల్ నెంబర్లను ఓటర్లకు స్పష్టంగా ప్రచారం చేసే విధం గా బ్యానర్లలో అధిక ప్రాధాన్యత ఇచ్చా యి. అలాగే కరపత్రాలు, ప్యాకెట్ పుస్తకాలను కూడా ప్రచురించి ఓటర్లకు పంపిణీ చేశారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.80 లక్షలకు పైగా యూనియన్లు ఖర్చు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీకి నివేదికలు పంపాయి