నవోదయం.. శుభోదయం కరుణోదయం
Published Wed, Dec 25 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
మానవాళికి శాంతి, దయ, ప్రేమలను పంచిన కరుణామయుడైన జీసస్ రాకకోసం క్రైస్తవులు ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. దయామయుడైన ప్రభువు సందేశాన్ని వివరిస్తున్నారు. జిల్లాలో క్రిస్మస్ సందర్భంగా చర్చిలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో చర్చిలు మిలమిల మెరుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.
గాంధీనగర్, (కాకినాడ) న్యూస్‌లైన్ :క్రైస్తవుల విశ్వాసం ప్రకారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 25న ఏటా పవిత్రమైన క్రిస్మస్ వేడుకను జరుపుకుంటారు. క్రైస్ట్, మాస్ రెండు పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే ప్రభువైన క్రీస్తు, మాస్ అంటే సమూహంగా ఆరాధించడం. జిల్లాలోని ఊరువాడా క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యింది. ఆరాధికులు కరుణామయుని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పునీతులయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ వేడులకు ప్రతీ చర్చిని ప్రత్యేకంగా అలంకరించారు.
క్రైస్తవులకు ఈ నెల అంతా హాలిడేస్ సీజన్. సీజన్ ఆఫ్ గివ్వింగ్, సీజన్ ఆఫ్ జాయ్‌గా అభివర్ణిస్తూ భక్తితో జరుపుకుంటారు. మానవతా మూర్తి క్రీస్తువాక్కును హృదయాల్లో నింపుకుంటారు. దీనిని స్పిరిట్ ఆఫ్‌గా క్రిస్మస్‌గా పిలుస్తారు. క్రిస్మస్ సందర్భంగా పశువులపాకలో పుట్టిన దృశ్యాన్ని బొమ్మలతో అందంగా అలంకరిస్తారు. జిల్లాలో మూడువేల వరకు పెద్ద చర్చిలు, ఆరువేలు చిన్న చర్చిలు ఉన్నాయి. లూథరన్, బాప్టిస్ట్, రోమన్ కేథలిక్, మన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. కోనసీమలోని గోదావరి డెల్టా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. బైబిల్ క్విజ్, బైబిల్ లిటరరీ పోటీలు,
పాటల పోటీలు నిర్వహించి క్రిస్మస్ రోజున బహుమతులు అందజేస్తారు. రోమన్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. లూధరన్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి చర్చిలో క్రిస్మస్ ఫీస్ట్‌ను నిర్వహించారు. కాకినాడ హౌస్ ఆఫ్ ప్రేయర్, క్రేగ్ మోమోరియల్ బాప్టిస్ట్ చర్చి, తుని నాసా చర్చి, రాజమండ్రి సెయింట్‌పాల్స్ లూధరన్ చర్చి, చర్చి ఆఫ్ షారోన్, గొల్లప్రోలు రోమన్ కేథలిక్ చర్చి, చెందుర్తి బాప్టిస్ట్ చర్చి, రంపచోడవరంలోని చర్చి ఆఫ్ క్రైస్ట్, అమలాపురంలో మన్నా మినిస్ట్రీస్, తుని బాప్టిస్ట్ చర్చిలలో వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు బహూకరించి భోజనాలు పెడతారు. చిన్నపిల్లలు, మహిళలు, యవ్వనస్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రతాప్‌సిన్హా, కార్యదర్శి రెవరెండ్ డానియేల్‌పాల్, కోశాధికారి దొమ్మేటి శామ్యూల్‌సాగర్, ఉపాధ్యక్షుడు ఎలీషా, హనీన్, జోసఫ్‌బెన్నీ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా క్రిస్మస్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక ఆరాధన
క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లాలోని వివిధ చర్చిల్లో ప్రత్యేక ఆరాధనను ఏర్పాటు చేశారు. ప్రధాన చర్చిలలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మతబోధకులు ప్రత్యేక సందేశాలను అందించనున్నారు. కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్వొయర్ కో-ఆర్డినేటర్ సైలస్‌పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించనున్నారు. కొన్ని చర్చిల్లో క్రీస్తు పుట్టుకకు సూచికంగా కేండిల్ సర్వీస్‌ను నిర్వహిస్తారు. ప్రత్యేక ఆరాధన అనంతరం అందరూ కలిసి క్రిస్మస్ విందును ఆరగిస్తారు.
Advertisement
Advertisement