సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి ప్రయివేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి ప్రయివేట్ విద్యా సంస్థలు మూతపడ్డాయి. మంగళవారం జిల్లా బంద్ జరగనుంది. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ మూతపడనున్నాయి. జిల్లాలో చిన్న పార్లర్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్నీ బంద్ కానున్నాయి. వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. జిల్లాలో ప్రయివేట్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది.
ఆర్టీసీ బస్సులు గత నెల 12వ తేదీ నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం జిల్లా ప్రజలంతా ప్రైవేటు వాహనాలు, ఆటోలపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ బంద్‌కు ఆటో కార్మికులు కూడా సంఘీభావం తెలపడంతో జిల్లా వాసులు సొంత వాహనాలు తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా కూడా ఈ బంద్‌లో భాగస్వాములవుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.