ఆకాశమే హద్దుగా..
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణించగలమని అతివలు రుజువు చేస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు..అంతరిక్షంలోనూ విహరిస్తున్నారు. దేశ రక్షణలోనూ మేము సైతం అంటూ బాధ్యతలు తీసుకుని, విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రీడలు, వ్యవసాయం, వైద్యం, విద్య, రాజకీయం.. ఇలా ఏ రంగమైనా ఆకాశమేహద్దుగా దూసుకుపోతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం.
రాజకీయాల్లో రాణింపు
స్థానిక సంస్థల్లో గతంలో మహిళలకు 33 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. దీన్ని ప్రభుత్వం 50 శాతానికి పెంచింది. ఫలితంగా జిల్లాలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సగం మంది మహిళలే ఎన్నికయ్యారు. ఇక జెడ్పీటీసీ సభ్యుల్లోనూ సగం మంది మహిళ లే. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సైతం గీర్వాణి పదవిలో కొనసాగుతున్నారు. దీంతోపాటు మున్సిపల్ చైర్‌పర్సన్లుగా సైతం రాణిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలుగా పలువురు మహిళలు రాజకీయాల్లో తమదైన శైలిలో సత్తా చాటుతున్నారు.
ఉద్యోగాల్లోనూ మేటి
జిల్లాలో దాదాపు 44 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా ఇందులో 32 శాతం మహి ళా ఉద్యోగులు ఉండడం విశేషం. దీంతోపాటు ఔట్‌సోర్సింగ్ విభాగంలోనూ సగం స్త్రీలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 200 మందికి పైగా మహిళా రక్షకభటులు ఉన్నారు. ఇక వ్యవసాయ శాఖలో ఏవోలుగా పలువురు రాణిస్తున్నారు. వైద్యులు, వెటర్నరీ డాక్టర్లుగా క్షేత్రస్థాయిలో మహిళలు రాణిస్తున్న తీరు అమోఘం.
చదువుల్లోనూ బాలికలదే హవా
పది, ఇంటర్, డిగ్రీ ఫలితాలు వెలువడ్డాయం టే చాలు బాలికలదే హవా కొనసాగుతోం ది. ఈ పరీక్షల్లో 65 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవుతున్నారు. ఇక పోటీ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంటోంది.
పొదుపులో దిట్ట
మామూలుగా డబ్బును పొదుపు చేయడంతో మహిళల పాత్ర కీలకం. జిల్లాలో మొత్తం 66 మండలాలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో కలిపి 80 వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. ఇందులో మహిళా గ్రూపులు నడుపుతున్న ఆర్థిక లావాదేవీలు ఏటా రూ.32 కోట్లకు పైమాటే. దీంతో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుం బాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్నారు.
పేద బతుకులకు వెలుగు.. చిట్టెమ్మ
తిరుపతి కల్చరల్: వేలాది మంది మహిళా జీవితాల్లో వెలుగులు నింపు తూ వారి ఉన్నతికి తోడ్పడుతున్న మహిళ చిట్టెమ్మ. ఎర్రావారిపాళెంలోని నిరుపేదల రాజమ్మ, పెద్దరంగయ్య దంపతులకు మూడో సంతానం చి ట్టెమ్మ. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమె కుటుంబ కష్టాలను గ్ర హించి చదువును నిలిపివేసి కుటుంబానికి ఆదరవుగా నిల వాలని కుట్టుమిషన్ నేర్చుకుంది. తద్వారా తనవంతు సహకారం అందించింది. నా రాయణను పెళ్లి చేసుకుని బతుకు తెరువు కోసం తిరుపతి లింగేశ్వరనగర్ చేరుకుని టైలరింగ్ ద్వారా సంపాదిస్తూ జీవనం సాగిస్తోంది. పాచి పనులు చేస్తున్న తోటి మహిళల కష్టాలు చిట్టెమ్మను బాధించాయి. నిరుపేద మహిళల అభివృద్ధికి తనవంతు సాయం చేయాలని సంకల్పించింది. స్వలాభాన్ని ఆశించకుండా వారికి టైలరింగ్ నేర్పించడం ఆరంభించింది. అలా 1984లో తొలుత ఐదుగురికి టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి సుమారు 36 ఏళ్లుగా ఐదు వేల మందికి టైలరింగ్ నేర్పి, వారి జీవితాల్లో వెలుగును నింపింది.
సామాజిక సేవకురాలు ‘సొక్కం’
మదనపల్లె సిటీ:జిల్లాలోని పడమటి మండలాల్లోని మహిళలు చాలా వెనుపడ్డారు. ఇలాంటి తరుణంలో మదనపల్లె పట్ట ణం రెడ్డీస్ కాలనీకి చెందిన సొక్కం రమాదేవి సుమారు 20 ఏళ్లుగా మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ మె ఎంఎస్‌సీ సోషల్‌వర్క్ చదివారు. తన భర్త నాగరాజు ములకలచెరువులో గాంధీయన్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ కోసం భర్తతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, పేద మహిళల స్థితి గతులు స్వయంగా తెలుసుకున్నారు. వారిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించి, 1988 నుంచి తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో మహిళా గ్రూపుల ఏర్పాటు చేశారు. వేలాది మందికి పలు ఉపాధి కో ర్సులు ఉచితంగా నేర్పించారు. భర్త మరణాంతరం సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మహిళాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాల్లోని బాలికల విజ్ఞానయాత్రల కోసం ఏటా సుమారు 4 వేల మందికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నారు. పాఠశాలలకు పుస్తకాలు అందజేస్తున్నారు.
ఉత్తమ అధికారిణిగా పీవో లక్షి నేడు సీఎం చేతుల మీదుగా కర్నూలులో అవార్డు స్వీకరణ
చిత్తూరు(గిరింపేట):స్త్రీ శిశు సంక్షే మ శాఖ (ఐసీడీఎస్) జిల్లా ఇన్‌చార్జి ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ ఉత్త మ అధికారిణిగా ఎంపికయ్యా రు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భం గా ప్రతి ఏడాది స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనితీరు బాగున్న అధికారులను జిల్లా స్థాయిలో ఒకరిని ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పీడీ లక్ష్మీ ఎంపికయ్యారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడంలోనూ .. వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ప్రతిభ చూపారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆమెను ఎంపిక చేశారు. 1993లో విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం ఉన్నత పోటీ పరీక్షలను రాసి ఎంపీడీఓగా, సహకార సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా, మెప్మా అంకౌట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సర్వశిక్షాఅభియాన్, ఐసీడీఎస్‌లో పీడీగా విధులను నిర్వహిస్తున్నారు.