
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ఆదర్శ(మోడల్) పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో ఉచితంగా విద్యనందించడమే ధ్యేయంగా 2013లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. జిల్లాలో తుమ్మిసి, గుడుపల్లె, నడిమూరు, బైరెడ్డిపల్లి, కురబలకోట, తంబళ్లపల్లె, మొలకలచెరువు, రామకుప్పం, కేవీపల్లె, కలకడ, పెద్దతిప్పసముద్రం(పీటీఎం), పెద్దమండ్యం, కేవీబీ పురం, ఎర్రావారిపాళ్యం, దిన్నెపల్లి, బి.కొత్తకోట, అడవినాథుని కుంటలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
సీట్ల కేటాయింపు ఇలా ..
జిల్లాలో 17 పాఠశాలలుండగా, ఒక్కో పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులున్నాయి. ఒక్కో గ్రూపులో 80 మంది చొప్పున 1,360 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతిలో వచ్చిన గ్రేడ్ పాయింట్లు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇంటర్ రెండో సంవత్సరంలో మిగిలిన సీట్లకు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రవేశాలు పొందవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా ..
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం ఠీఠీఠీ. ్చpఝట. ్చp. జౌఠి. జీn, ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పాస్‌ఫోర్ట్ ఫొటో, బోనిఫైడ్, ఆధార్‌కార్డు వివరాలు పొందుపరిచి దరఖాస్తు సమర్పించాలి. ఆన్‌లైన్‌లో అప్‌లై చేసిన కాఫీతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, పదోతరగతి మార్కుల మెమో జెరాక్స్ ప్రతులను ఏ కళాశాల ప్రవేశం కోసం నమోదు చేసుకున్నామో ఆ కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాల్సి ఉంటుంది.
నేటితో దరఖాస్తుకు ఆఖరు..
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ వరకు అవకాశంఉంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.