
మోడల్ స్కూలు
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంగ్లిష్ మీడియం కావడం, అందులోనూ బాలికలకు హాస్టల్ వసతితో కూడిన విద్యను అందిస్తుండటంతో వాటిలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రారంభ క్లాసైన ఆరో తరగతి కాకుండా 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే వాటిలో 200 కన్నా ఎక్కువ ఖాళీలు ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదీ జూన్ నాటికి ఇతర స్కూళ్లకు ఎవరైనా వెళితేనే ఆ ఖాళీలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు.
10,275 దరఖాస్తులు
జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు 10,275 మంది విద్యార్థులు 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మోడల్ స్కూళ్లకు చెందిన 3,450 మంది విద్యార్థుల్లో 1,131 మంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. బాసర ట్రిపుల్‌ఐటీలోనూ ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్ స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఆరో తరగతిలో 19,400 సీట్లు..
2018–19 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం మోడల్ స్కూల్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తంగా 194 పాఠశాలల్లో 19,400 సీట్లు ఆరో తరగతిలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 10,958 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈనెల 16వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో మరో 25 వేల మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
నిజామాబాద్‌లో అత్యధిక దరఖాస్తులు
ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లా నుంచి 923 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, జగిత్యాల జిల్లా నుంచి 843 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డిలో 705 మంది, నల్లగొండలో 692 మంది, రంగారెడ్డిలో 650 మంది, సిద్దిపేటలో 638 మంది నుంచి అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక తక్కువ దరఖాస్తులు నిర్మల్ (91మంది) నుంచి వచ్చినట్లు చెప్పారు.
మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు షెడ్యూలు
16–2–2018: ఆన్‌లైన్‌లో (http://telanganams.cgg.gov.in) దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి తేదీ
11–4–2018 నుంచి 15–4–2018: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
15–4–2018: ప్రవేశ పరీక్ష, (ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష,
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష)
16–5–2018 నుంచి 19–5–2018: జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రవేశాల జాబితా ఖరారు
20–5–2018 నుంచి 25–5–2018: ప్రవేశాలకు ఎంపికైన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్