నేడు సమైక్య శంఖారావం
- వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ రాక నేడు
- మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి..
- 3 గంటలకు చోడవరం సభ
- సాయంత్రం 5కు పాతగాజువాకలో..
- విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
సమైక్య ఉద్యమంలో ఇది మహోజ్వల ఘట్టం. కుత్సితాల చీకట్లను తొలగించుకుని వేయివెల్గులరేడుగా ప్రభవించిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా విశాఖ గడ్డపై సమైక్య సమర శంఖం పూరించేందుకు శనివారం రానున్నారు. ఈ సందర్భంగా జనహృదయాధినేతకు ఘన స్వాగతం పలికేందుకు అభిమాన కోటి ఉవ్విళ్లూరుతున్నారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆయన విమానాశ్రయానికి చేరుకుంటారు. జగన్ అక్కడినుంచి నేరుగా చోడవరం పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సమైక్య శంఖారావం సభలో ప్రసంగించనున్నారు. చోడవరం నుంచి సాయంత్రం ఐదు గంటలకు గాజువాక చేరుకుంటారు. సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగిస్తారు.
చోడవరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనే చోడవరం, గాజువాక సమైక్య శంఖారావం సభలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర పోగ్రాం కో- ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా శాఖ అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పాల్గొనే సమైక్య శంఖారావం సభ ప్రదేశాన్ని శుక్రవారం వారిద్దరూ పరిశీలించారు. కొత్తూరులోని నాలుగు కూడళ్ల జంక్షన్ వద్ద సభాస్థలిని చూశాక వారు మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు చోడవరంలో, సాయంత్రం 5 గంటలకు గాజువాకలో జరిగే సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం సభలో కూడా పార్టీ అధినేత పాల్గొంటారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢనిశ్చయంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. సమైక్యవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సభ నిర్వహణపై సీఈసీ సభ్యుడు పీవీఎస్‌ఎన్ రాజుతో, సమన్వయకర్తలు బలిరెడ్డి సత్యారావు, బూడి ముత్యాలనాయుడుతో సమీక్షించారు. పార్టీ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.