మార్మోగిన సమైక్యవాణి
- అలుపెరుగని జననేత పర్యటన
- సమైక్యశంఖారావం యాత్ర విజయవంతం
- ఆప్యాయపలకరింత...
- కష్టాలపై భరోసా
- అన్ని వర్గాలతో మమేకం
జిల్లాలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర క్షణం తీరిక లేకుండా సూర్యుడితో పోటీపడుతూ సాగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం శంఖాన్ని పూరించిన జగన్ ‘ఈ రాష్ట్రాన్ని విభజించేందుకు మీరు ఒప్పుకుంటారా..’ అని జనాన్ని ప్రశ్నిస్తూ.. వారితో ‘నో..’ అన్న సమాధానాన్ని ఓ పదునైన నినాదంగా మలుస్తూ ముందుకు సాగారు.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జిల్లాలో నాలుగు విడతలుగా సాగిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారంతో ముగి సింది. తనకోసం రోడ్డుపైకి వచ్చిన ఏ అవ్వా, తాతా నొచ్చుకోకూడదు.. ఏ అక్కా, చెల్లీ చిన్నబుచ్చుకోకూడదు.. నన్ను పలుకరించకుండా వెళ్లిపోయాడే అని ఏ చిన్నారీ బుంగమూతి పెట్టుకోకూడదన్న పట్టింపు., పట్టుదల జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపించాయి.
అడుగడుగునా అభిమానంతో తరలివచ్చిన జనానికి ఓ ఆప్యాయ పలకరింత, ఓ అనురాగ స్పర్శ, అవ్వా తాతలకు నుదిటిపై ప్రేమానురాగాల చుంబనం., చిన్నారుల సంబరానికి తన సంతకాన్ని కానుకగా ఇస్తూ... ముందుకు సాగారు. చిన్న చిన్న గ్రామాల్లో దివంగత నేత విగ్రహావిష్కరణల సందర్భంగా కూడా ఉపన్యాసాన్ని ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకే పరిమితం చేసి, వేదిక దిగి అక్క చెల్లెళ్లు, అవ్వాతాతల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలడిగి.. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి.. రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుందంటూ భరోసా ఇచ్చారు.
ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చవుతుంది ? ఇందిరమ్మ ఇంటికోసం ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బు సరిపోతుందా ? ఇంటి ప్లాను ఎలా ఉండాలి ? ఇత్యాది సూక్ష్మమైన అంశాలన్నిటిపై ఇటీవల స్థానిక నేతలను జగన్ ఆరాతీశారు. రోడ్డుకిరువైపులా తనకోసం వచ్చి నిలుచున్న జనంలోకి వెళ్లి.. వాళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మీ ఇబ్బందులు పోవాలంటే రాబోయే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని జనాన్ని అడిగారు. క్లుప్తమైన ప్రశ్నలు వేస్తూ.. వారిచ్చే సుదీర్ఘ సమాధానాలను శ్రద్ధగా ఆలకించారు.
సన్న చిన్న కారు రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల జీవితానుభవాల లోతుల్లోకి చూసే ప్రయత్నం చేశా రు. పేదల సమస్యల పరిష్కారానికి వైఎస్‌ఆర్ సీపీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం ఎలా ? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ‘మేథావుల’ చర్చల్లో కాకుండా సామాన్యుని జీవిత అనుభవం నుంచి తెలుసుకోవాలన్న తపన ఆయనలో కనిపించింది.
రైతుల గానుగల వద్దకు వెళ్లారు. మరమగ్గాల కార్మికులను పలకరించారు. వలస కూలీల వెతలను ఓపిగ్గా ఆలకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పెద్ద ఎత్తున జనాభిప్రాయాన్ని సమీకరిస్తూ, ఇతర జిల్లాల నుంచి తరలి వస్తున్న ‘ఆశావహు’లతో సంభాషిస్తూ.. సమాధానపరుస్తూ.. మరో వైపు పేదల జీవితాల బాగుకు మరింత మెరుగైన పాలన ఎలా అందివ్వగలమన్న సమాచారాన్ని ఆ ప్రజల నుంచే తెలుసుకుంటూ జగన్ యాత్ర సాగింది.