జన హృదయ విజేత వైఎస్
- అడుగడుగునా అపూర్వ స్వాగతం
- రేణిగుంట నుంచి పుత్తూరు వరకు మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షో
- {బాహ్మణపట్టు, పత్తిపుత్తూరుల్లో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
- చక్కెర ఫ్యాక్టరీని కాపాడాలని రైతుల వినతి
- సమైక్యాంధ్ర మీవల్లే సాధ్యమంటూ విద్యార్థుల నినాదాలు
సాక్షి, చిత్తూరు: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కుమారుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పుయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రారంభమైన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో సాగింది. నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణానికి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకునే సమయానికి రాత్రి 9.30 గంటలు అయింది.
చలిగా ఉన్నా జనం లెక్కచేయక తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేచి ఉన్నారు. పుత్తూరు పట్టణంలో రాత్రి కిక్కిరిసిన జనం మధ్య జగన్ మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం పూరిం చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా అసెంబ్లీలో రాష్ట్ర విభజన కోసం చర్చలు జరుగుతుండడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ చేసిన ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన వచ్చింది. ఇదిలావుండగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం విమానాశ్రయం నుంచి గురవరాజుపల్లె పంచాయతీ రామక్రిష్ణాపురం చేరుకుని అక్కడ రోడ్‌షో నిర్వహించారు. జనం వాహనాన్ని ఆపి జననేతను కలిశారు.
ఆయన వారిని పలకరించి ముందుకు కదిలారు. కేఎల్‌ఎం ఆస్పత్రి ప్రాంతంలో చిన్నపిల్లలు, మహిళలను చూసి జగన్ వాహనం ఆపి కిందకు దిగి వారితో కరచాలనం చేసి మాట్లాడారు. మహిళలు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. అక్కడ నుంచి గాజులమండ్యం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి వై.ఎస్.జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. ఇక్కడ దాదాపు గంట సేపు రోడ్డుకు ఇరువైపులా నిలబడిన మహిళలను, విద్యార్థులను ఒక్కొక్కరిని పలకరించి వారు చెప్పింది విన్నారు.
తన కోసం వేచి ఉన్న విద్యార్థులతో ముచ్చటిస్తూ ‘మీరు బాగా చదువుకోవాలమ్మా’ అంటూ వారి భుజం తట్టి ప్రొత్సహించారు. ఈ సందర్భంగా యువకులు, విద్యార్థులు సమైక్యాంధ్ర మీ వల్లే సాధ్యమంటూ జైజగన్ అని నినాదాలు చేశారు. గాజులమండ్యం- షుగర్‌ఫ్యాక్టరీ వరకు నేషనల్‌హైవేలో నిలిచిన బస్సుల్లో నుంచి జనం కిందకు దిగి నిలబడి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఆర్‌టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చేతులూ ఊపుతూ జగన్ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం యాత్రకు మద్దతు పలికారు.
ఎస్‌వీ షుగర్స్‌ను కాపాడండి
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రేణిగుంట ఎస్‌వీ షుగర్స్‌ను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఫ్యాక్టరీ షేర్‌హోల్డర్స్‌గా ఉన్న ఈ ప్రాంత రైతులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ ముందు వైఎస్‌ఆర్‌సీపీ అధినేతకు స్వాగతం పలికారు. వినతిపత్రం సమర్పించారు. మహానేత వైఎస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఫ్యాక్టరీ మూతపడే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము ప్రభుత్వంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని వై.ఎస్.జగన్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయిల్ ఫ్యాక్టరీ, అల్లికేశం వరకు యువకులు కాన్వాయ్ వెంట బైక్‌ల్లో ర్యాలీగా వచ్చి అభిమానం చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో జగన్ వెంట నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
నగరి నియోజకవర్గంలో..
వై.ఎస్.జగన్ తొలి రోజు పర్యటనలో వడమాలపేట మండలం కదిరిమంగళం నుంచి నగరి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. కదిరి మంగళం వద్ద పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు, నగరి ఇన్‌చార్జ్ ఆర్.కె.రోజా నాయకత్వంలో గ్రామస్తులు, నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి వై.ఎస్.జగన్ పూడి గ్రామం చేరుకున్నారు. ఇక్కడ మహిళలు మంగళహారతులు, పూలమాలలు వేసి స్వాగతించారు. మహిళలు అందరినీ వారి వద్దకు వెళ్లి పలకరించి జగన్‌మోహన్‌రెడ్డి అర్ధగంటకుపైగా ఇక్కడ ఉన్నారు.
పూడి గ్రామం దాటగానే అప్పలాయిగుంట క్రాస్ వద్ద యువకులు, మహిళలు గుమిగూడి రోడ్డుపై పూలు చల్లుతూ స్వాగతించారు. ఇక్కడ ఒక అభిమాని వైఎస్ కుటుంబసభ్యుల ఫొటోను జగన్‌కు అందజేశారు. పూడి ఎస్‌సీ కాలనీ, బీసీ కాలనీల్లోనూ ప్రజలు జగన్‌ను ఆపి మాట్లాడేందుకు, తమ సమస్యలు చెప్పేందుకు ఉత్సాహం చూపారు. ఇక్కడ ఉన్న స్టయిపాక్ థర్మోకోల్ ఫ్యాక్టరీ ఆవరణకు వెళ్లి వైఎస్‌ఆర్‌టీయూసీ జెండాను కార్మికుల కోరిక మేరకు ఆవిష్కరించారు. కాయం, కాయంపేట గ్రామాల్లో యువతులు జెండాలు ఊపుతూ వై.ఎస్.జగన్‌కు స్వాగతం పలికారు.
నాలుగు అడుగుల స్థలమూ ఇవ్వని ప్రభుత్వం
కాయంపేట నుంచి చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణపట్టు వద్దకు వై.ఎస్.జగన్ చేరుకున్నారు. ఇక్కడ మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద్దసంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘బ్రాహ్మణపట్టు గ్రామం చిన్నదైనా ఈ గ్రామస్తుల మనస్సు అందులో మహానేత విగ్రహానికి స్థలం ఇచ్చిన శంకర్‌రెడ్డి తాత మనస్సు ఎంతో పెద్దది, గొప్పది. ఆ మహానేత విగ్రహం ఏర్పాటుకు నేను స్థలం ఇస్తానని ఆ తాత సొంత స్థలం నాలుగు అడుగులు ఇచ్చారు.’ అంటూ వై.ఎస్.జగన్ గ్రామస్తులను అభినందించారు. ‘ఈ ప్రభుత్వం మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగు అడుగుల స్థలం అడిగితే ఇవ్వలేదు’, అంటూ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.
ఈ పర్యటనలో జగన్ వెంట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగరి ఇన్‌చార్జ్ ఆర్.కె.రోజా, పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జిల్లా యువత కన్వీనర్ ఉదయ్‌కుమార్, జిల్లా కార్మిక వర్గ కన్వీనర్ బీరేంద్రవర్మ ఉన్నారు.
అప్పలాయగుంట వేంకటేశ్వరుని దర్శనం
వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆలయంలో స్వామిరిని దర్శించుకుని, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణపట్టు నుంచి చింతకాల్వ మీదుగా పత్తిపుత్తూరు వరకు రోడ్‌షో నిర్వహించారు. పత్తిపుత్తూరులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ నుంచి గొల్లపల్లె, తిరుమణ్యం, టి.ఆర్.కండ్రీ, వేమాపురం, వడమాల మీదు గా వడమాలపేట చేరుకున్నారు. సాయంత్రం వడమాలపేట బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడ నుంచి ఎస్‌యూపురం, లక్ష్మీపురం, తడుకుస్టేషన్‌ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ పుత్తూరు మండలం చేరుకున్నారు. మజ్జిగకుంట, తడుకు, గొల్లపల్లె ప్రాంతాల్లో చలిని సైతం లెక్క చేయకుండా జనం వేచి ఉండడం కనిపించింది. వై.ఎస్.జగన్ పుత్తూరు అగ్రహారం, ఈసలాపురంలో రోడ్‌షో నిర్వహించారు.
పుత్తూరు పట్టణంలో రోడ్ షో..
సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారం రాత్రి పుత్తూరు పట్టణానికి చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పుత్తూరు బైపాస్ క్రాస్ నుంచి ఘనస్వాగతం పలుకుతూ బాణసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్.కె.రోజా, చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వానించారు. రైల్వేఓవర్ బ్రిడ్జి మీదుగా, బజారువీధి, కార్వేటినగరం సర్కిల్ వరకు రోడ్‌షో సాగింది.