నేడే టెట్ ఏర్పాట్లు పూర్తి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : ఈ నెల 16న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష తొమ్మిది కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష 67 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పరీక్ష నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 134 మంది సూపరింటెండెంట్లు, 12 మంది రూట్ ఆఫీసర్లు, 748 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. అభ్యర్థులు పరీక్షా సమయం కంటే గంట ముందే పరీక్షా కేంద్రం వద్దకు రావాలని ఆయన సూచించారు.
పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతిస్తామని తెలిపారు. పరీక్షా సమయం దాటి ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో తాగునీరు, వైద్య, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు.