- అనుమతిలేకుండా తరగతులు నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా
- పబ్లిక్ పరీక్షలకు పంపేది లేదు
- డీఈవో వెల్లడి
మచిలీపట్నం : జిల్లాలో గుర్తింపులేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరఢా ఝుళిపించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించనున్నారు. రెండేళ్ల కిందట 235పైగా గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 145కు చేరింది. వాటిలో 33 ప్రాథమిక, 34 ప్రాథమికోన్నత, 78 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
వేసవి సెలవుల అనంతరం గుర్తింపు లేని పాఠశాలలను తెరిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో పాటు అదనంగా రోజుకు రూ.10వేలు చొప్పున జరిమానా వసూలు చేయనున్నట్లు డీఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేశామని, యాజమాన్యాలు త్వరగా గుర్తింపు పొందాలని సూచించారు. ఆ జాబితా ఎంఈవోలకు పంపామని, డీఈవో వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయని తెలిపారు.
పబ్లిక్ పరీక్షలకు ప్రవేశం లేదు...
ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ మారింది. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వాల్సి ఉంది. గుర్తింపు లేని పాఠశాలల్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇంటర్నల్ మార్కులు వేసే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు పంపే అవకాశం ఉండదని డీఈవో తెలిపారు. ప్రైవేటు విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచి రెగ్యులర్‌గా పబ్లిక్ పరీక్షలు రాసే వెసులుబాటును ప్రభుత్వం తొలగించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్చాలని ఆయన కోరారు.