నేడు వైఎస్ జగన్ రాక
సాక్షి, అనంతపురం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనంతపురం రానున్నారు. నగర శివారులోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయం సమీపంలో ఉన్న రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ ప్రోటోకాల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లను వారితో పాటు సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం పరిశీలించారు.
షెడ్యూల్ ప్రకారం హాజరుకండి
వైఎస్‌ఆర్‌సీపీ సమీక్ష సమావేశాలకు సంబంధించి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా నియోజకవర్గాల నేతలు హాజరు కావాలని శంకరనారాయణ కోరారు. ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమైన నాయకులు 100 మందికి పాస్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. పాస్‌లు ఉన్నవారు మాత్రమే హాజరు కావాలన్నారు. కేటాయించిన వారి కంటే ఎక్కువ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వస్తే చర్చించాల్సిన సమస్యలకు సమయం సరిపోదని, సమయం వృథా కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి