
నేడు జిల్లాకు ప్రముఖుల తాకిడి
విజయవాడ సిటీ/ గన్నవరం, న్యూస్‌లైన్ : గుంటూరులో ఆదివారం జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో జిల్లాకు ప్రముఖుల తాకిడి పెరగనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీఐపీలు విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో నాగార్జున యూనివర్సిటీకి వెళతారు. రాత్రి 7.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 10.30కి విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళతారు.
ప్రమాణ స్వీకర కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు గవర్నర్ నరసింహన్, గుజరాత్, పంజాబ్, నాగాలాండ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, మురళీమనోహర్‌జోషి, నజ్మాహెప్తుల్లా, అనంతకుమార్, పీయుష్ గోయల్, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు రానున్నారు.
విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు...
ప్రముఖుల రాక నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. విమానాశ్రయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించడంతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సీఎం సెక్యూరిటీ వింగ్ అధికారులతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వీఐపీల కోసం విశ్రాంతి, భోజన సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత ఏర్పాట్లులో భాగంగా శనివారం సాయంత్రం అధికారులు కాన్వాయ్ ట్రాయల్న్ ్రకూడా నిర్వహించారు.
ఏర్పాట్ల పరిశీలన...
విమానాశ్రయ ఆవరణలో వీఐపీల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను శనివారం డీజీపీ జేవీ రాముడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరిశీలించారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన డీజీపీ భద్రత ఏర్పాట్ల గురించి సీపీ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌లతో చర్చించారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న సీఎస్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.