- నేడు కూడా బంద్ కొనసాగుతుందన్న ఎస్వీయూ విద్యార్థులు
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్‌ను తొలగించాలని విద్యార్థి సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ చరిత్రలో ఏ రిజిస్ట్రార్ చేయని విధంగా ప్రస్తుత రిజిస్ట్రార్ విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఆయన పదవిని చేపట్టిన రోజు నుంచి అన్నింటిలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఓఎంఆర్ షీట్లలో లక్షల రూపాయలను కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. అధ్యాపకుల నియామకాల్లో నోటిఫికేషన్‌కు ముందే అడ్వాన్స్ రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పదవి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మెస్‌లు ఎందుకు తెరవరు?
ఎస్వీ యూనివర్సిటీలో కళాశాలలు పునఃప్రారంభించి నెల రోజులు కావస్తున్నా మెస్‌లు ఎందుకు తెరవలేదని విద్య్రార్థులు ప్రశ్నించారు. కార్డు విధానం ప్రవేశపెట్టి విద్యార్థులను అవమానిస్తున్నారన్నారు. ముందుగా కాషన్ డిపాజిట్ కట్టించుకున్న అధికారులు మళ్లీ మెస్‌లలో భోజనం చేయడానికి కార్డుల విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. మెస్‌లు తెరవకపోవడం వల్ల కొందరు విద్యార్థులు హోటళ్లలో తిని ఆరోగ్యం పాడుచేసుకోవాల్సి వస్తుందన్నారు. మరికొందరు పేద విద్యార్థులు గుళ్లలో ప్రసాదాలతో పొట్టనింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రిజిస్ట్రార్ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఆయనకు మళ్లీ పదవి ఇవ్వాలని చూడడం దారుణమన్నారు. జాయింట్ రిజిస్ట్రార్ నాగమ్మ, ప్రిన్సిపాళ్లు కేవీఎస్.శర్మ, డి.ఉషారాణి విద్యార్థులతో చర్చించారు. వీసీ వచ్చిన తర్వాత చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని విద్యార్థులు మంగళవారం కూడా బంద్ కొనసాగిస్తామని చెప్పారు. బంద్‌లో విద్యార్థినాయకులు వెంకటరమణ, నాదముని, రామ్మోహన్, లోకనాదం, సురేష్‌నాయక్, భాస్కర్‌యాదవ్, హేమాద్రియాదవ్, ఏజే.సూరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.