
రైతు చూపు.. తణుకు వైపు
నేటి రైతుదీక్షకు స్వచ్ఛందంగా తరలివెళుతున్న అన్నదాతలు, మహిళలు
వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీశ్రేణుల పయనం
ఏర్పాట్లలో జిల్లా నేతలు
విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు దీక్షకు జిల్లా మద్దతు పలుకుతోంది. ఎన్నికల హామీలను గాలి కొదిలేసిన అధికారపార్టీ రైతులను, మహిళలను వంచిస్తున్న తీరుపై ఉద్యమబాట పట్టిన వైఎస్సార్ సీపీకి మద్దతుగా తరలివెళ్లేందుకు ప్రతిఒక్కరూ సమాయత్తమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శని, ఆదివారాల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేసేందుకు రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివెళుతున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో ప్రదర్శనగా తణుకు వెళ్లటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హామీలు విస్మరించి కాలం గడుపుతున్నారు..
అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేస్తామని విస్తృత ప్రచారం చేసింది. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ దీనిని చేర్చడంతో రైతులు, మహిళలు బాబు మాటలు నమ్మి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించి కాలంగడుపుతోంది. రుణమాఫీ అమలుకు కమిటీ అని, విడతల వారీగా రుణమాఫీ అని, స్కేల్ ఆఫ్ పైనాన్స్ అని రకరకాలుగా మాటలు చెబుతుండటంతో అన్నదాతలు, మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, రైతుల పక్షాన నిలిచి దశలవారీగా పోరాటం సాగిస్తోంది. ఇప్పటికే రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దారు కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి రైతుల పక్షాన పోరు సాగిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రెండురోజుల దీక్ష నిర్వహిస్తున్నారు.
జిల్లా నుంచి నేతల పయనం...
జగన్ దీక్షకు జిల్లా నుంచి ముఖ్య నేతలు తణుకు పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గత ఐదు రోజులుగా ఉండి దీక్షా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా పార్టీ సమన్వయకర్తలు సామినేని ఉదయభాను, పేర్ని నాని, వంగవీటి రాధాక ృష్ణ తదితరులు గత మూడు రోజులుగా అక్కడే ఉండి దీక్షల నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు. గత నాలుగు రోజుల్లో జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రక్షణనిధి, మేకా వెంకట ప్రతాప అప్పారావు తదితరులు ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దీక్షలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కార్యకర్తలకు వివరించారు. పార్టీ దక్షిణ క ృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి దీక్షకు తరలివెళ్లేలా శ్రేణులను సమాయత్తం చేశారు.
ప్రభుత్వం ఆటంకాలు
మరోపక్క ప్రజలు కూడా జిల్లాలోని పలు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివెళ్లటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది. పార్టీ కార్యకర్తలు తణుకు వెళ్లటానికి ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వాలని కోరిన క్రమంలో అనేక బస్సు డిపోల్లో మేనేజర్లు బస్సులు అద్దెకు ఇవ్వటానికి నిరాకరించారు. తమకు దీక్షకు బస్సులు ఇవ్వటానికి అనుమతి లేదని చెబుతున్నారు.