నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం
సాక్షి, అమరావతి: నగదు రహిత చెల్లింపులపై ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్థికశాఖ ఉన్నతాధికారు లు, బ్యాంకర్లతో సమావేశమై నివేదికపై ఆయన చర్చించారు. సీఎంల కమిటీ ఈ నివేదికను మంగళవారం ప్రధానికి ఇవ్వనుందని తెలిపి సోమవారం మధ్యాహ్నంలోగా డిజిటల్ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో దీన్ని 60 శాతానికి తీసుకెళ్లాలని చెప్పారు.
విజయవాడ చేరుకున్న చంద్రబాబు
ఇదిలా ఉండగా దావోస్ పర్యటన ముగించుకుని శనివారం అర్ధరాత్రి సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చేందుకుగాను సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.