రేపే కమలనాథన్ ముసాయిదా మార్గదర్శకాలు
అందరినీ ఆప్షన్లు అడిగినా వాటిని
సరిగణనలోకి తీసుకోవాలని లేదు
వెబ్‌సైట్లో ముసాయిదా మార్గదర్శకాలు.. అభ్యంతరాలకు 10 రోజుల సమయం
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకీ లకమైన ముసాయిదా మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ శుక్రవారం విడుదల చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఖరారు చేసిన ఈ ముసాయిదా మార్గదర్శకాలను కమిటీలోని అధికారుల సంతకాల కోసం పంపారు. శుక్రవారంనాటికల్లా సంతకాలు పూర్తవుతాయని, అదే రోజు సాయంత్రానికి ముసాయిదా మార్గదర్శకాలు విడుదలవుతాయని, వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో ఉంచుతారని అధికారవర్గాలు తెలిపాయి. వాటిపై అభ్యం తరాలు, సలహాల కోసం పది రోజుల సమయం ఇస్తారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీ కార్యాక్రమాన్ని ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముసాయిదా మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
రాబోయే రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలి
రాష్ట్ర కేడర్‌కు చెందిన 51 వేల మంది ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. కొన్ని రంగాలకు చెందిన వారి ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
పదవీ విరమణ చేయబోతున్న, నిర్ధారించిన వ్యాధులతో బాధపడుతున్న వారు, భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగులైతే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు గల వారి ఆప్షన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా వారందరినీ ఆప్షన్లు అడిగినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఏదీ చట్టంలో లేదు. ఆప్షన్లు తీసుకోవాలనే నిబంధన మాత్రమే ఉంది.
తొలుత కేటగిరీవారీగా కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు పోస్టుల సంఖ్యను పంపిణీ చేస్తుంది. ఖాళీలతో సహా జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పోస్టుల పంపిణీ జరుగుతుంది. ఆతర్వాత తొలుత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయిస్తుంది.
ఈ కేటాయింపుల్లో ఏదైనా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన ఉద్యోగులకన్నా ఇద్దరు ఎక్కువగా ఉండి.. అదే కేటగిరీలో తెలంగాణలో అవసరమైన దానికన్నా ఇద్దరు ఉద్యోగులు తక్కువగా ఉంటే ఆప్షన్లు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రాలో ఎక్కువున్న ఉద్యోగులు ఇద్దరినీ తెలంగాణకు కేటాయిస్తారు.
ఈ విధంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన తరువాత ఏ ప్రభుత్వంలో ఎక్కడి వారు ఎంత మంది ఉన్నారో తేలుతుంది. దాని ఆధారంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేసుకొని, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను అదే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.