కార్మికులను హింసిస్తే ఊరుకోం : జోగి | Torment workers urukom: Jogi | Sakshi
Sakshi News home page

కార్మికులను హింసిస్తే ఊరుకోం : జోగి

Published Sat, Jan 25 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

Torment workers urukom: Jogi

  •   ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుడు మృతి
  •   ఆగ్రహంతో కార్మికుల ఆందోళన
  •   ఎట్టకేలకు విరమణ
  •  
    ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : కార్మికులను హింసించే చర్యలను మానుకోని పక్షంలో  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని  వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగిరమేష్ ఎన్టీటీపీఎస్ అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎన్టీటీపీఎస్‌లోని 15ఎ/ కన్వేయర్స్ కోల్ విభాగంలోని కన్వేయర్ పుల్లీలో పడి  సందిపాము రవికుమార్ (34) అనే కాంట్రాక్టు కార్మికుడు శుక్రవారం మృతి చెందడంతో ఆగ్రహానికి గురయిన కార్మికులు ప్లాంట్ ఆవరణంలోనే ఆందోళనకు దిగారు.  

    కోల్ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న రవికుమార్ మృతికి ఏడీఈ భాస్కరరావే ప్రధాన కారణమంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగిన కార్మికులకు మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నేత జ్యేష్ట రమేష్‌బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రఘునాధరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆవుల సీతారామయ్య, సీపీఐ నాయకుడు తాతయ్య, సీపీఎం నాయకులు తమ్మారాంబాబు, విఠల్‌లతో పాటు వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.

    జోగి రమేష్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కార్మికుని భార్యకు పర్మినెంట్ ఉద్యోగం కల్పించి వారి పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటే సహించబోమని చెప్పారు. భవిష్యత్‌లో కార్మికులకు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసరావు, పర్వతనేని సాంబశివరావు, కృష్ణబాబు  మాట్లాడుతూ ప్లాంట్‌లో కార్మికులకు ప్రమాదాలు జరగకుండా భద్రతా పరికరాలు అందజేయాలన్నారు.

    అనంతరం జరిగిన చర్చల్లో ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య మాట్లాడుతూ మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు రవి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటానని, అతని భార్యకు కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగం కల్పిస్తానని తెలిపారు. తాము డిమాండ్ చేసిన విధంగా నష్ట పరి హారం రూ. 20 లక్షలు ఇచ్చే వరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించేది లేదని కార్మికులు అడ్డుతగిలారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్‌పీఎప్ బలగాలు  మొహరించి ఉన్నాయి.
     
    శోక సంద్రంలో బంధువులు
     
    ఉదయం 8గంటలకు ప్రసాద్ నగర్‌నుంచి బయలు దేరి వెల్లిన రవికుమార్ (34) 9.30 గంటలకు ప్రమాదంలో దుర్మరణం చెందాడన్న విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతునిది జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామం కాగా ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్‌లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. మృతునికి భార్య జ్యోతి, కుమార్తె లోరి (6) కుమారుడు నాగార్జున(8) ఉన్నారు.
     
    జోగి, జ్యేష్టల పరామర్శ
     
    మృతుడి భార్య జ్యోతిని, కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగిరమేష్, పార్టీనేత, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు వేర్వేరుగా కలిసి పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement