నరకయాతన..!
పిడుగురాళ్ల : ఔషధ బాధితులు నిత్యం నరకయాతనతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని పట్టించుకునే నాథుడు లేక, సాయం అందక విలవిలలాడుతున్నారు. పిడుగురాళ్ల పట్టణం ఆదర్శనగర్, లెనిన్‌నగర్‌లలో సుమారు 24 మంది ఔషధ బాధితులు ఉన్నారు. 2011లో హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన యాక్సిస్ క్లినిక్స్ లిమిటెడ్ ల్యాబ్‌లో ఔషధ తయారీ కోసం మనుషులపై ప్రయోగాలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఔషధ ప్రయోగ బాధితుల్లో ఐలా నరసింహారావు(43) అనారోగ్యానికి గురై మృతి చెందాడు.
మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. బతక లేక దీనావస్థలో ఉన్నారు. ఈ ల్యాబ్‌లో మూడు నెలలకు నిర్వహించాల్సిన రక్త పరీక్షలు ఒక్క నెలలోనే మూడు సార్లు నిర్వహించడం వల్ల రక్తహీనత ఏర్పడి అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన 24 మందికి రోజు వ్యవధిలోనే 18 సార్లు 15 ఎంఎల్ చొప్పున రక్తాన్ని శ్యాంపిల్‌గా తీసి ప్రయోగాలు నిర్వహించారు. కొన్ని ట్యాబ్లెట్లు మింగించి ప్రయోగాలు నిర్వహించారు. ఫలితంగా వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు.
పట్టించుకోని అధికారులు....
అప్పట్లో ఔషధ ప్రయోగాలపై స్పందించి ప్రభుత్వం హుటాహుటిన బాధితులను హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి పంపి వైద్య సేవలు అందించింది. అంతేకాక, అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులంతా బాధితులు కోలుకునేంతవరకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఇప్పటికీ వారంతా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు.
అందని సహాయం..
ఔషధ ప్రయోగాలకు గురైన 24 మందికి ఆరోగ్య సేవలతో పాటు ఒక్కొక్కరికి రెండు సెంట్ల స్థలం, ఆ స్థలంలో గృహాన్ని నిర్మించి ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల నష్టపరిహారం అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. వీటిల్లో ఒక్కటి కూడా వారి దరిచేరలేదు.
ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతున్నా ...
నన్ను ముందుగా ల్యాబ్‌లో పరీక్షించి నాకు 43546 అనే నంబర్ ఇచ్చారు. ఈ నంబర్ యాక్సిస్ క్లినికల్ ల్యాబ్‌లో ఎంటర్ చేస్తే నాకు ఏ పరీక్షలు నిర్వహించారో, ఏ మందులు వాడారో అన్న పూర్తి వివరాలు వస్తాయి. వీళ్ల ప్రయోగాల వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతున్నాను.
- కొమ్ము కరుణమ్మ,బాధితురాలు
ఎడమ వైపు భాగాలన్నీ పనిచేయడం లేదు
ఏవో పరీక్షలు చేసి మందులు ఇచ్చి రూ.10 వేలు ఇస్తామని చెబితే ఇల్లు గడవని పరిస్థితిలో పరీక్షలకు ఒప్పుకున్నా. కొన్ని రోజులకు ఎడమ వైపు శరీర భాగాలన్నీ పనిచేయడం లేదు. పది వేల కోసం ఆశపెడితే ఇప్పుడు ఏ పని చేసుకోలేకపోతున్నా.
- అడిగొప్పల మల్లీశ్వరి, బాధితురాలు
కుడి కంటి చూపు పోయింది ...
ల్యాబ్‌లో పరీక్షలు చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కళ్లల్లో నుంచి విపరీతమైన ఆవిరితో పాటు నీరు కూడా కారింది. కొన్ని రోజులకు కుడి కంటిచూపు పూర్తిగా పోయింది. ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఏమైనా పనులు చేసుకోవాలన్నా సహకరించడంలేదు. ఎక్కువ శాతం మంచం మీదే గడపాల్సి వచ్చింది. పేదరికంతో డబ్బు కోసం ఆశపడి పరీక్షలు చేయించుకుంటే ఇప్పుడు మంచాన పడాల్సి వచ్చింది.
- షేక్ బీబీ, బాధితురాలు