
కష్టకాలం
పాలకుల నిర్లక్ష్యం పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాక మైనార్టీ విద్యార్థుల చదువులకు భరోసా కరువైంది. అటు ప్రభుత్వం నుంచి ఫీజులు రాక.. ఇటు కళాశాల యాజమన్యాల ఒత్తిడి భరించలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
కడప రూరల్:
జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలో ఇంటర్మీడియేట్, ఆపై చదివే విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజులను చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు ఎప్పుడొస్తాయోనని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
450 కళాశాలల్లో....
ఫీజుల పథకానికి అర్హులైన జిల్లాలోని మైనార్టీ వర్గానికి చెందిన నిరుపేదలు మొత్తం 450 కళాశాలల్లో 11945 మంది ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఇంటర్మీడియట్, ఆపై విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఫీజుల కింద ప్రభుత్వం ఆయా కళాశాలల యాజమాన్యాల ఖాతాలకు డబ్బును జమ చేయాల్సి ఉంటుంది. అయితే, 2012-13 విద్యా సంవత్సరంలో కొంతమందికి, 2013-14 విద్యా సంవత్సరంలో అందరికీ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ఆ విద్యార్థులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మేరకు రూ. 11.05 కోట్లు విడుదాల కావాల్సి ఉండగా, ఇంతవరకు జమ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
విద్యార్థులపై ఒత్తిళ్లు..
దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం ఫీజులను చెల్లించకపోవడంతో విద్యార్థులపై కళాశాల యాజమాన్యాల ఒత్తిడి ఎక్కువైంది. ముఖ్యంగా రెన్యూవల్ విద్యార్థులకు ఫీజులు కట్టమని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఫీజులను చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు.
నిధులు రాని మాట వాస్తవమే
జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు ఫీజు రాని విషయం వాస్తవమే. ఇందుకు సంబంధించి ఏవో సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలో బడ్జెట్ రాగానే ఫీజు మొత్తాన్ని విడుదల చేస్తాం. - ఖాదర్‌బాష, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి, కడప