
సాక్షి, అరకు : ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువు చెప్పిస్తే, ఈనాడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగమిచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం అరకులో ఏపీ టూరిజం యాత్రి నివాస్ హోటల్లో రెండు కోట్లతో నిర్మించిన డైనింగ్ రెస్టారెంట్‌ను స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేరు గన్నెల , పద్మాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన 211 కుటుంబాల కార్యకర్తలు మంత్రి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాక్సైట్ మైనింగ్‌ను రద్దు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని అభినందించారు. గిరిజనులకు మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు. అన్ని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రూ.156 కోట్లతో అరకు టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పారు. గిరిజనులు అమాయకులనీ, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలనుందని అన్నారు.
ఎంపీ మాధవి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీస్సుల వల్ల చిన్న వయసులోనే ఎంపీ కాగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. భారత టూరిజం శాఖ పార్లమెంటు కమిటీలో తాను మెంబరుగా ఉన్నాననీ, అరకు టూరిజంను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకొని చంద్రబాబు అంధకారంలో ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరకు నియోజకవర్గానికి 39 రోడ్లను మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన క్వార్టర్‌ను గిరిజన మహిళల కోసం ప్రసూతి హాస్టల్‌గా మార్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ కూడా పాల్గొని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment