![Tourist Bus Roll Over In Bhogapuram - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/13/bus.jpg.webp?itok=GLDjaZUY)
స్థానిక అక్కివరం కూడలి వద్ద శనివారం ఉదయం ప్రమాదవశాత్తు టూరిస్టు బస్సు బోల్తా పడింది. బస్సులో 45మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే...వైఎస్సార్ జిల్లా (కడప), ప్రొద్దుటూరు నుంచి ఏపీ04 టీడబ్ల్యూ 3413 టూరిస్టు బస్సు కాశీయాత్రకు భక్తుల్ని తీసుకు వెళ్లింది. యాత్రను పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరింది. శనివారం ఉదయం పూసపాటిరేగ వద్ద యాత్రికులు టీ తాగి బయలుదేరారు. అక్కివరం కూడలి వద్దకు వచ్చేసరికి అండర్ పాస్ పనులు జరుగుతున్న చోట ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేశాడు. అతన్ని తప్పించబోయిన డ్రైవరు బ్రహ్మయ్య బస్సును రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలతో ఏర్పాటు చేసిన స్టాపర్‌లను ఢీకొట్టింది. రోడ్డు పక్కకు బస్ నిలపడంతో, వంతెన నిర్మాణానికి రోడ్డు తవ్వేసి ఉండడంతో గోతులోకి రోడ్డు పెళ్ళలు విరిగి పడ్డాయి. దీంతో బస్సు గోతిలోకి ఒరిగి పోయింది. బస్సు పూర్తిగా కింద పడకుండా సిమ్మెంటు దిమ్మలు అడ్డు పడడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న వారు పిల్లలతో సహా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న వారిని ఎ.రావివలస పంచాయతీ కార్యాలయానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment