ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లుమంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు
మంత్రి శిద్దా రాఘవరావు
తాళ్లూరు : ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లుమంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలో శుక్రవారం పలు ప్రారంభోత్సవాల్లో కలెక్టర్ సుజాత శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో కందుకూరు సబ్ కలెక్టర్ మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే రూ.100 కోట్లతో రోడ్లు వేశామని, మరో రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ రైతులు ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు.
డీఆర్‌డీఏ పీడీ మురళి మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘ నిధిని ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, తాళ్లూరు సర్పంచి ఐ. పెద్దిరెడ్డిలు మండల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పొదుపు సంఘాలకు రూ.2.15 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్‌బాబు, తహశీల్దార్ సరోజిని, వైస్ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.