పెళ్లికి వెళ్తుండగా... | Tractor rolls over 20 people Injuries | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్తుండగా...

Published Sun, Jun 24 2018 12:47 PM | Last Updated on Sun, Jun 24 2018 12:47 PM

Tractor rolls over 20 people Injuries - Sakshi

బొబ్బిలి రూరల్‌: వారంతా ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగబోయే వివాహానికి ఆనందంగా బయలుదేరారు. గ్రామం దాటి కిలోమీటరున్నర దూరం వెళ్లేసరికి ట్రాక్టర్‌ బోల్తా çపడింది. దీంతో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ పరిధిలో కొల్లివలసకు చెందిన పూతి పైడితల్లి వివాహం ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగనుంది. 

ముందుగా ఆటోలో పెండ్లి కుమార్తె, కుటుంబ సభ్యులు వెళ్లిపోగా గ్రామానికి చెందిన బంధువులు ట్రాక్టర్‌లో శనివారం ఉదయం బయలుదేరారు. ట్రాక్టర్‌ పిరిడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూడి అజయ్, పూడి సింహాచలం, పుట్ట రాములమ్మకు చేతులు విరిగిపోయాయి. భోగాది నారాయణమ్మ, పి.తిరుపతి, తియ్యాల అచ్చెమ్మ, తియ్యల సంధ్య, కొల్లి సత్యవతి, వెంకటలక్ష్మి, తియ్యాల లక్ష్మి,  దురగాసి పార్వతి, తియ్యాల పద్మ, తదతరులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి పీహెచ్‌సీకి తరలించారు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో పిరిడి పీహెచ్‌సీలో వైద్యసేవలందించి పంపించివేశారు. 

బొబ్బిలి పీహెచ్‌సీ వైద్యాధికారులు శోభారాణి, రామనరేష్‌ క్షతగాత్రులకు వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.  ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన సోదరుడు బేబీనాయన ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. 

ట్రాక్టర్‌ తరలింపు...
 ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ను తరలించేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ట్రాక్టర్‌ లేదు. దీంతో ఆయన స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రెండు బైక్‌లు ఢీ..∙ఇద్దరికి గాయాలు
భోగాపురం: మండలంలోని లింగాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన విజయ్, రమేష్‌ ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. లింగాలవలస వద్దకు వచ్చేసరికి ఒక యువకుడు ద్విచక్రవాహనంతో డివైడర్‌ పైనుంచి రోడ్డు దాటే ప్రయత్నంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేయడంతో విజయ్‌ తన ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో విజయ్, రమేష్‌ గాయపడ్డారు.  

ఆటో – బైక్‌ ఢీ..
గజపతినగరం రూరల్‌: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో స్వీట్‌హోమ్‌ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.  వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ తవుడు ప్రయాణికులను ఎక్కించుకుని గజపతినగరం వైపు వస్తుండగా, స్వీట్‌హోమ్‌ వద్దకు వచ్చేసరికి గజపతినగరం నుంచి మానాపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ద్విచక్రవాహనదారుడు కొర్లాపు శ్రీనుతోపాటు  ఆటోలో ఓ పక్కన కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు రెండు వాహనాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement