నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని ఉద్యోగులందరూ సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ చొప్పా రవీంద్రబాబు తెలిపారు. స్థానిక ఎన్‌జీఓ భవన్‌లో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం, ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారని తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో నుంచి ఏసీస్టేడియం వరకు సమైక్య రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, సమైక్యవాదులు సమైక్యరన్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 17, 18 తేదీల్లో చలో పార్లమెంటు కార్యక్రమానికి జిల్లా ప్రజలు 15వ తేదీ నుంచే ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంటుందన్నారు.
గతంలో ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మెకాలాన్ని క్రమబద్ధీకరించి ఆర్జిత సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీఓ 33 విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య ఉద్యోగుల మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కరుణమ్మ సేవలు గుర్తించి రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ కన్వీనర్‌గా నియమించినందుకు ఆమెను అభినందించారు. ఈ సమావేశంలో రమణారెడ్డి, జోషి, సుధాకరరావు, ప్రభాకర్‌రెడ్డి, శివకుమార్, హైమావతి, శ్రీకాంతరావు, శ్రీనివాసులురెడ్డి, రవికుమార్, శేఖర్‌రావు, సతీష్‌బాబు, శైలజ పాల్గొన్నారు.
నేటి అర్ధరాత్రి నుంచి వీఆర్‌ఓల సమ్మె
నెల్లూరురూరల్ : సమైక్య రాష్ట్ర సాధన కోసం బుధవారం అర్ధరాత్రి నుంచి వీఆర్‌ఓలు సమ్మెలో పాల్గొంటున్నట్లు వీఆర్‌ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె బాట
Published Wed, Feb 5 2014 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement