ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి చేపట్టే మాదిగల ..
తిరుపతి కల్చరల్: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి చేపట్టే మాదిగల ఆత్మగౌరవ చైతన్య పాదయాత్రను జయప్రదం చేయాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధికార ప్రతినిధి జి.గిరిధర్ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన చైతన్య పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న తిరుపతిలో ప్రారంభమయ్యే చైతన్య పాదయాత్ర శ్రీకాకుళం వరకు సాగుతుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలు ఎంతో నష్టపోతున్నారని వాపోయారు. అంతేకాకుండా మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటాను రాకుండా చేసి అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపి వర్గీకరణ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు. చర్మకారుల అభ్యున్నతి కోసం లిడ్‌క్యాప్‌ను పునరుద్ధరించడంతో పాటు మాదిగ ఉపకులాల వారికి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ రంగంలో జీవో 25ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు మస్తాన్‌బాబు, మణి, సుధాకర్ మాదిగ, ప్రకాష్, పట్టాభి, అశోక్ మాదిగ, సుబ్రమణ్యం మాదిగ , నాగరాజు మాదిగ పాల్గొన్నారు.