
సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల కారణంగా భార్యాభర్తలపై రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదమర్రి మండలం వరిగపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య విమలమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జగన్నాధ రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే...వరిగపల్లి గ్రామానికి చెందిన జగన్నాధ రెడ్డి, రంజిత్ మధ్య కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంపై కోర్టు కేసు కూడా నడుస్తోంది. భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చిన జగన్నాథ రెడ్డి ఇవాళ ఆ భూమిని ట్రాక్టర్‌తో సాగుచేసేందుకు ప్రయత్నించాడు. కేసు కోర్టులో ఉండగా ఎలా దున్నుతావని, రంజిత్ స్నేహితుడు గోవిందరాజులు.. జగన్నాధ రెడ్డి దంపతులను ప్రశ్నించాడు. ఈ విషయాన్ని రంజిత్‌కు సమాచారం అందించడంతో అక్కడకు వచ్చిన అతడు వారిపై నుంచి ట్రాక్టర్‌ను పోనివ్వడంతో విమలమ్మ అక్కడికక్కడే చనిపోయింది. జగన్నాధ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.