టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ | Transport huge target | Sakshi
Sakshi News home page

టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ

Published Thu, Nov 20 2014 1:53 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ - Sakshi

టార్గెట్ భారీ.. తనిఖీలకు రెడీ

వార్షిక లక్ష్యం రూ.341 కోట్లు
ఇప్పటికి రూ.167 కోట్ల ఆదాయం
ప్రత్యేక డ్రైవ్‌లకు రవాణా శాఖ సిద్ధం
గ్రామీణ ప్రాంతాల్లో వరుస తనిఖీలకు నిర్ణయం

 
 భారీగా విధించిన టార్గెట్‌లను చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలకు సిద్ధమవుతోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. వచ్చే వారం నుంచి అమలులోకి  తీసుకురానుంది.

విజయవాడ : జిల్లా రవాణా శాఖ అధికారులు భారీ ఆదాయం రాబట్టుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర రవాణా శాఖ జిల్లాకు భారీ టార్గెట్‌ను నిర్దేశించిన నేపథ్యంలో దానిని చేరుకునే దిశగా ప్రత్యేక డ్రైవ్‌లు, వరుస తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని కొంతమేరకైనా చేరుకోవటంతో పాటు రవాణా భద్రతను మరింత పటిష్టపరచటమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ప్రధానంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమం జరగడం లేదు. కేవలం విజయవాడ నగర పరిసర ప్రాంతాలు, మునిసిపాలిటీల సమీపంలోనే రవాణ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నారు.

జిల్లా రవాణ శాఖకు ఆశాఖ కమిషనర్ ఈఏడాది రూ. 341 కోట్ల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో అన్ని కమర్షియల్ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు, మూడు నెలలకు ఒకసారి చెల్లించే త్రైమాసిక టాక్స్‌లు పూర్తి స్థాయిలో వసూలు చేయగలిగితే లక్ష్యాన్ని 90 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోగా వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే గడిచిన ఎనిమిది నెలల కాలంలో రూ.167 కోట్లు ఆదాయం లభించింది. గత ఏడాది రూ.304 కోట్లు వార్షిక లక్ష్యం విధించగా, రూ.223 కోట్లు వసూలు చేసి లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.  గత ఏడాది రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధ్రుతంగా సాగిన విషయం తెలిసిందే. రవాణాశాఖ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆదాయం భారీగా పడిపోయింది. ఈక్రమంలో కనీసం ఈఏడాది అయినా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఎనిమిది నెలల కాలానికి కనీసం 70 శాతం లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 50 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈక్రమంలో నూతనంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఎస్.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆదాయం పెంపుదలే ప్రస్తుత ప్రధాన ఎజెండాగా తీసుకొని ఆయన కసరత్తు ప్రారంభించారు.
 
గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం

 
జిల్లాలో మొత్తం 1,44,341 వాహనాలు ఉన్నాయి. వీటిలో 46 వేలు గూడ్స్ వెహికల్స్ కాగా, 12,987 ట్రాక్టర్లు, 13,880 ట్రాలీలు, 24,811 ద్విచక్ర వాహనాలు, 332 అంబులెన్స్‌లు, 40 వేల ఆటోలు, 550 బస్సులు, 2400 స్కూల్ బస్సులు, 8,882 లారీలతో పాటు ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు అనేకమంది త్రైమాసిక పన్ను సక్రమంగా చెల్లించటం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ముందుగా ట్రాక్టర్ యజమానులకు అవగాహన నిర్వహించి అందరూ తప్పనిసరిగా పన్ను చెల్లించేలా చేయటానికి కసరత్తు ప్రారంభించారు. పొలం పనుల సీజన్‌లో మినహా అనేకమంది ట్రాక్టర్లు వినియోగించడంలేదు. ఈక్రమంలో అలాంటి యజమానులు అందరూ రవాణాశాఖ అధికారులకు దానికి సంబంధించి దరఖాస్తు ఇస్తే అలాంటి వారికి టాక్స్ పడదు. ప్రస్తుతం రెండో త్రైమాసిక పన్నులు నూరు శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే జిల్లాలో రవాణ శాఖకు సంబంధించి గరికపాడు, తిరువూరు ప్రాంతాల్లో రెండు చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి. ఇవికాకుండా జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసి రవాణ భద్రత పెంచటంతో పాటు ఆదాయం కూడా పెంచుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యంగా ట్రాక్టర్లు, లైట్ గూడ్స్ వాహనాల యజమానులు సక్రమంగా త్రైమాసిక పన్నును చెల్లించడంలేదని అధికారులు నిర్ధారించుకున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, ప్రెవేట్ బస్సుల్లో ఓవర్‌లోడింగ్ ఎక్కువగా ఉంది. దీనిపై కూడా దృష్టి సారించి డ్రైవ్ నిర్వహించటం ద్వారా ప్రమాదాలను నివారించటంతోపాటు కేసుల నమోదు ద్వారా ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు. మరోవైపు  ఒక్కొక్క చోట కాకుండా ఒకేరోజు ఎక్కువ ప్రాంతాల్లో డ్రైవ్ కొనసాగించాలని నిర్ణయించారు. విజయవాడ రాజధాని అయిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఐదు శాతం వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. ఈక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవటానికి డ్రైవ్‌లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement