దసరాకు భారంగా మారిన ప్రయాణం
రెగ్యులర్, ప్రత్యేక బస్సులలో అదనపు వడ్డన
రేట్లతో దూకుడు పెంచిన ప్రైవేటు ట్రావెల్స్
అవస్థలున్నా రైలు ప్రయాణాలకే జనం మొగ్గు
విశాఖపట్నం / మర్రిపాలెం: దసరా పండుగ ప్రభావంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఇదే అదనుగా ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ట్రావెల్స్ వారు దండిగా ఛార్జిలు వసూలుచేస్తున్నారు. దీంతో సామాన్య జనం కష్టపడైనా రైళ్లలో కుక్కుకునే వెళ్తున్నారు.
కలిసొచ్చిన సెలవులు..
విశాఖ నగరానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రా ష్ట్రాల నుంచి కూడా జనం విద్య, ఉపా ధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజులు వరుసగా బుధవారం మహర్నవమి, గురువారం విజయదశమి, శుక్రవారం మొహరం, ఆదివారం సెలవులు కావడంతో మధ్యలో శనివారం కూడా సెలవు తీసుకుంటున్నారు. ప్రైవేటు సంస్థల సిబ్బంది కూడా సెలవుల బాటపడుతున్నారు.
ప్రత్యేక సర్వీసులు..
జిల్లాలో ఆర్టీసీకి 1016 బస్సులున్నాయి. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, శ్రీకాకుళం, నర్శీపట్నం, విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల రాబడి వచ్చే ఆర్టీసీకి దసరా సీజన్లో రోజుకు రూ.1కోటి ఆదాయం వస్తోంది. దసరా సందర్భంగా రోజూ 200 అదనపు బస్సులు నడుపుతోంది. వీటిలో 110 బస్సులు భవానీ భక్తుల కోసం కేటాయిచారు. రాజధాని శంకుస్థాపనకు అమరావతికి జనాన్ని తరలించడానికి 40 బస్సులు కావాలని జిల్లా కలెక్టర్ ఆర్టీసీని కోరారు. అవి కూడా ఇస్తే అదనపు సర్వీసుల్లో కోత పడుతుంది.
నిలువు దోపిడీ..
డిమాండును దృష్టిలోపెట్టుకుని ఆర్టీసీ దూర ప్రాంత ప్రత్యేక సర్వీసులకు ప్రస్తుత టిక్కెట్టు ధరపై 1.5 శాతం అదనపు రేటు వసూలు చేస్తోంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీఓ నుంచి అనుమతి తీసుకోవాలని, తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు లేక ఆయిల్ ఖర్చులు కూడా రావని ఈ కారణంగానే రేటు పెంచుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇటు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు చార్జీలను భారీగా పెంచేశారు. రోజూ నగరం నుంచి దాదాపు 50 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు వెళుతున్నాయి. వీటిలో కనీసం రెండు, మూడు రెట్లు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గరుడ ఏసీ బస్సులో రూ.2500 నుంచి రూ.3500 టిక్కెట్టుకు తీసుకుంటున్నారు. నాన్ ఏసీ బస్సుల్లోనూ టిక్కెట్టు ధరలు 100 శాతం నుంచి 200 శాతం పెంచారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకోకపోతే ఆ రేటుకైనా టిక్కెట్టు దొరకడం లేదు. ఆర్టీసీ ఈ నెల 25న బెంగుళూరుకు ఒక ఏసీ బస్సును, చెన్నైకు రెండు సూపర్ లగ్జరీలతో పాటు విజయవాడకు నాలుగు ఎసీ మెట్రో బస్సులు, ఎనిమిది సూపర్ లగ్జరీ బస్సులను నడపనుంది.
దసరా పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దాదాపు 25 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అవి ఏమాత్రం సరిపోవడం లేదు. బస్సులు,ప్రైవేటు వాహనాల్లో చార్జీల దోపిడీని తట్టుకోలేక ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజుకి దాదాపు 50 వేల మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా నానా అవస్థలు పడుతున్నారు.
టూరంటే ఠారెత్తాల్సిందే..
Published Wed, Oct 21 2015 3:26 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement