
ట్రెజరీ కుంభకోణంపై సీఎం సీరియస్
విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధం
{పిన్సిపల్ సెక్రటరీని మరోసారి కోరిన కలెక్టర్
నెలరోజులైనా స్పందించని వైద్య ఆరోగ్యశాఖ
ఉన్నతాధికారులను తప్పించేందుకు ప్రయత్నాలు
ఐసీడీఎస్, విద్యాశాఖల్లోనూ అవినీతి జలగలు
విశాఖపట్నం: రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఆయన దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు. విజిలెన్స్‌చే విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసిన కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో కూడా చర్చించినట్టు తెలియవచ్చింది. బుధవారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. విజిలెన్స్ విచారణ జరిగితే కానీ ఈ కుంభకోణానికి మూలమైన వైద్యఆరోగ్యశాఖ, ట్రెజరీ శాఖల్లో ఏ స్థాయి అధికారుల ప్రమేయం ఉందో.. ఎవరెవరు ఎంత స్వాహా చేశారో తేలే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు తేలిన మొత్తం రూ.3.61కోట్లుమాత్రమే అయినప్పటికీ ఈ మొత్తం కనీసం రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో చలానాలు.. పే స్లిప్‌లతో జీతభత్యాల బట్వాడా జరిగేది.
ఆన్‌లైన్ అమలులోకి వచ్చాక నేరుగా సంబంధిత ఉద్యోగి అకౌంట్‌లోకి జమవుతుండడంతో అవతకవకలకు కొంత మేర బ్రేకుపడింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో పక్కదారి పట్టిన మొత్తమే రూ.3.61కోట్లుంటే కనీసం ఐదారేళ్లకు ముందు లోతైనదర్యాప్తు జరిపితే ఈమొత్తం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటున్నారు. ఈ కుంభకోణం వెలుగు చూసి నెల రోజులైంది. నిధులను పక్కదారి పట్టించడంలో చక్రం తిప్పిన చింతపల్లి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంట్, ఎస్టీవోలపై వేటు వేశారు. కానీ ఈ కుంభకోణం ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో కోట్లు మింగిన ఘనులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఆ శాఖ ఉపక్రమించలేదు. అంతర్గత విచారణతో కాలయాపన చేసిన ఆ శాఖాధికారులు ఈ అవినీతిలోఎంతమంది ప్రమేయం ఉంది? ఏ స్థాయి అధికారుల భాగస్వామ్యం ఉందో మాత్రం నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకే ఆశాఖలో స్వాహాపరుల జాబితాను బయటకువిడుదల చేయడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. పైగా ఇందులో ప్రత్యక్షంగా కోట్లుమింగిన ఉన్నతాధికారులను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ ద్వారా విచారణ సాగుతోంది. విజిలెన్స్ విచారణ మొదలైతే కానీ కలుగులో దాక్కున్న అవినీతి ఎలుకలు బయటకొచ్చే అవకాశాల్లేవు.
కుంభకోణం మూలాలపై ఆరా
విశాఖ మెడికల్: చింతపల్లి ట్రెజరీలో ఇటీవల జరిగిన భారీ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తునకు నియమించిన అనకాపల్లి క్రైం విభాగం డీఎస్పీ కృష్ణవర్మతోపాటు ఇద్దరు సభ్యుల బృందం బుధవారం మధ్యాహ్నం విశాఖలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆరా తీశారు. ఈ వ్యవహారంలో కొందరు వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది పాత్ర ఉంటుందన్న అనుమానంతో డీఎస్పీ కృష్ణవర్మ డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది ప్రమేయంపై కూపీలాగారు. తొలుత డీఎంహెచ్‌వో డాక్టర్ జె.సరోజినిని కలిశారు. ప్రాథమిక సమాచారం సేకరణతోపాటు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఒక సీనియర్ సహాయకునితో పాటు వాహనాన్ని సమకూర్చాలన్నారు. అందుకు డీఎంహెచ్‌వో సుముఖత వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న కె.సూర్యనారాయణ అనే సీనియర్ సహాయకుడ్ని కేటాయించారు. 2012 ఏప్రిల్ నుంచి 2013 మార్చి 31 మధ్యకాలంలో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి పాడేరు అదనపు డీఎంహెచ్‌వోకు బట్వాడా చేసిన నిధులకు సంబంధించిన రికార్డులను అకౌంట్స్ విభాగం నుంచి దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగా అకౌంట్స్ విభాగం పర్యవేక్షకురాలు నిర్మల, కార్యాలయ పరిపాలనాధికారి విశ్వేశ్వరరావును విచారించారు.
వారి చిరునామాలు,సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. దీనికి సంబంధించి డీఎంహెచ్‌వో సరోజిని మాట్లాడుతూ ఈవ్యవహారంలో తమ కార్యాలయం ప్రమేయం ఉండదన్నారు. పాడేరు కేంద్రంగా ఉన్న 11 ఏజన్సీ మండలాల పరిధిలోని పీహెచ్‌సీల నిర్వహణకు సంబంధించిన 80 శాతం నిధులను ప్రభుత్వం అదనపు డీఎంహెచ్‌వో ఖాతాకు నేరుగా పంపిస్తుందన్నారు. ఆ నిధులు చాలని పక్షంలో 20 శాతం తమ కార్యాలయం నుంచి బట్వాడా చేస్తామన్నారు. అవి అదనపు డీఓంహెచ్‌వో ద్వారా పీహెచ్‌సీలకు సబ్‌ట్రెజరీద్వారా వెళ్తాయన్నారు.