పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌ | Cm Jagan Comments On Chandrababu And Yellow Media | Sakshi
Sakshi News home page

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌

Published Thu, Dec 21 2023 1:38 PM | Last Updated on Thu, Dec 21 2023 5:14 PM

Cm Jagan Comments On Chandrababu And Yellow Media - Sakshi

సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్‌.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు.

‘‘పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

నాకు కొండంత అండ అడవితల్లి బిడ్డలు
దేవుడుదయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్చమైన మనసులు మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్‌ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాల ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ... మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడి నాకిచ్చిన అదృష్టం.

ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టితల్లులు, పిల్లలు, నా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులు మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ.. మీ అందరి ప్రేమానురాగాలకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. 

మన పిల్లలే మన భవిష్యత్‌– మన వెలుగు
ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ప్రతి ఇంట ఉన్న పిల్లలు.. వీరే మన భవిష్యత్‌. వీరంతా మన వెలుగులు. వీరంతా మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన వారసులు. వీరి భవిష్యత్తు గురించి ఆలోచించి.. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రపంచంలో పోటీపడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని ఆశిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే  55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా పడింది. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు ట్యాబుల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతిమండలాన్ని సందర్శిస్తూ...ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా 10 రోజులపాటు 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

ట్యాబుల పంపిణీ దశాబ్దంలోనే గొప్ప మార్పు
ఇవాళ మనం ఇచ్చేవి కేవలం ట్యాబులు మాత్రమే కాదు. ప్రతి చెల్లెమ్మకూ ఒక మంచి అన్నగా, ప్రతి పిల్లాడికి,పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లలు మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో, తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకొస్తున్న  అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు పంపిణీ కూడా గొప్ప మార్పుగా రాబోయే దశాబ్దకాలంలో నిల్చిపోతుంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు 4,34,185 మందికి రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం. డిజిటల్‌విప్లవంలో భాగంగానే గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేసాం. పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌ను కూడా ప్రతి ట్యాబులోనూ ఆఫ్‌లైన్‌లో సైతం పనిచేసేటట్టుగా అప్‌లోడ్‌ చేసి మరి ట్యాబులు పంపిణీ చేస్తున్నాం.  ప్రతి పిల్లాడికి పాఠాలన్నీ పూర్తిగా, సులభంగా అర్ధం అయ్యేటట్టుగా, కష్టాన్ని తగ్గించేటట్టుగా బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసి పిల్లలకు అండగా నిలబడుతున్నాం.

ఈ ట్యాబుల విషయంలో నేను పిల్లలకు చెబుతున్నా.. ట్యాబులు రిపేరుకు వస్తే ఎవరూ కంగారుపడకండి. మీ హెడ్‌ మాష్టారు దగ్గరికి వెళ్లి చెడిపోయిందని రిపేరుకిచ్చినా, లేదా తల్లిదండ్రులతో పాటు గ్రామసచివాలయం దగ్గరకు వెళ్లి ఇచ్చినా రెండు చోట్ల రశీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీ ట్యాబ్‌ రిపేరు చేసి ఇస్తారు.ఒకవేళ రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతిలో పెడతారు. ఈ ట్యాబుల విషయానికొస్తే... ఇవి సెక్యూర్డ్‌ మొబైల్‌ డివైస్‌ మేనేజిమెంట్‌ అనే సాప్ట్‌వేర్‌ పెడ్డడం జరిగింది. దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాప్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన, భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ పిల్లలకు వాళ్ల చదువుల్లో మంచిచేసే ఒక గొప్ప ఇంధనంగా ఉంటుందని చెబుతున్నాను.

రూ.33వేల ఖరీదు చేసే ట్యాబ్, కంటెంట్‌ ఉచితంగానే
ఒక్కో పిల్లాడు చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్‌ మార్కెట్‌ విలువ రూ.17,500. దీనికి తోడూ బైజూస్‌ కంటెంట్‌ను ఇస్తున్నాం. ఎవరైనా శ్రీమంతులు పిల్లలు వెళ్లి బైజూస్‌ కంటెంట్‌ను కొనుగోలు చేసి, డౌన్లోడ్‌ చేసుకోవాలంటే రూ.15వేలు కడితే తప్ప డౌన్లోడ్‌ చేసుకోలేని పరిస్ధితి. అలాంటి ఈ కంటెంటెన్‌ ఉచితంగా డౌన్లోడ్‌ చేసి, ఈ ట్యాబులుతో సహా ఇస్తున్నాం. ఇవాళ 8వతరగతి విద్యార్ధి తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబ్, కంటెంట్‌ విలువతో కలుపుకుంటే రూ.33వేలు విలువ చేస్తుంది. 

మన పిల్లలు ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కావాలని..
ఈ పిల్లలందరినీ ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే.. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా నిలవాలన్న తలంపుతో వాళ్ల మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవైపు ట్యాబుల పంపిణీ చేస్తూనే.. మరోవైపున ప్రతి స్కూళ్లో 6వతరగతి నుంచి పైబడిన ప్రతి తరగతి గదినీ డిజిటలైజ్‌ చేసే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వతరగతి నుంచి 12వతరగతి వరకు ఉన్న ప్రతి తరగది గదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌(ఐఎఫ్‌పి)లు ఏర్పాటు చేస్తున్నాం.  ప్రతి తరగతిగదినీ డిజిటలైజ్‌ చేసే కార్యక్రమం జరుగుతుంది.

నాడు– నేడుతో సమూల మార్పులు
ఇందులో భాగంగా నాడు నేడు మొదటిదశ పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,715 స్కూళ్లలో 6వతరగతి ఆపై  ఉన్న 32,213 క్లాస్‌రూంలలో ఇప్పటికే ఐఎఫ్‌పిలు పెట్టి డిజిటలైజ్‌ చేశాం. అదే విధంగా 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్‌లు తీసుకువచ్చాం. వాటన్నింటిలోనూ స్మార్ట్‌ టీవీలు ఏర్పాటులో భాగంగా .. దాదాపు 10,038 స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ ఐఎఫ్‌పీలు, క్లాస్‌రూంల డిజిటౖలñ జేషన్‌ కోసం మొదటిదఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు.  నాడు–నేడు రెండో దఫా పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడకి రాకముందు అధికారులను అడిగాను. రెండోదఫా నాడు–నేడు పనులు పూర్తి చేసి అక్కడ ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ బిగించి 6వతరగతి నుంచి ఈ పైచిలుకు తరగతిగదులను డిజిటలైజ్‌ చేయడానికి ఎంత 
టైం పడుతుందని అడిగాను. దాదాపు మరో 31,884 తరగతి గదులు 6వతరగతి ఆ పై తరగతిగదులన్నీ డిజిటలైజ్‌ అయి, పూర్తిగా 62,097 తరగతిగదులన్నీ డిజిటలైజ్‌ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని చెప్పారు. 

సందేహాల నివృత్తికి యాప్‌లు సైతం
ప్రతి తరగతి గదిని డిజిటలైజ్‌ చేయడమే కాకుండా ఎస్‌.డి కార్డు, ఆండ్రాయిడ్‌ బాక్సులన్నింటితో పాటు ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఉన్నచోట బైజూస్‌ కంటెంట్‌ కూడా అప్‌లోడ్‌ చేసి ఉంటుంది. అంటే పిల్లలకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన పాఠాలను తరగతిగదిలో నేర్పుతారు. ఇవే పాఠాలను వాళ్లకున్న ట్యాబులలో కూడా ఉంతాయి. దీనివల్ల పిల్లలకు కన్ఫ్యూజన్‌ ఉండదు. మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా  ఈ ట్యాబులున్నప్పుడు, ఈ పాఠాలలో పిజిక్స్, మేథ్స్‌ బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టులో పిల్లలకు సందేహాలు వస్తే.. వాటిని నివృత్తి చేసుకోవడం ఎలా ? ఎవరు చెప్తారు ? అన్న సందేహం ప్రతి పిల్లాడికి, తల్లిదండ్రులకూ ఉంటుంది. అందుకనే ఈ సారి పిల్లలకిచ్చే ఈ ట్యాబులలో ఒక యాప్‌ను కూడా డౌన్లోడ్‌ చేయడం జరిగింది.

డౌట్ క్లియరెన్స్‌ బాట్‌ అనే యాప్‌ను డౌన్లోడ్‌ చేయడం జరిగింది. దీన్ని వాడుకుని పిల్లలు తమ సందేహాలను చెప్పినా, టైప్‌ చేసినా వాటిని నివృత్తి చేసుకునే సౌలభ్యం ఉండేలా యాప్‌ను డౌన్లోడ్‌ చేశాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు?  ఎలా చదువుతున్నారు? ట్యాబులలో ఏం ఉంది? ఇంకా ఎలా దాన్ని పిల్లలకు ఉపయోగపడేలా మెరుగుపర్చాలి. పిల్లలకు సులభంగా అర్ధమయ్యేలా చేయాలి అని ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ... మీ పిల్లల గురించి ఆలోచనచేసే మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఈ సందేహాల నివృత్తి కోసం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వాడుకునేలా తీసుకొచ్చే కార్యక్రమమూ జరుగుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో ఇతర విదేశీ భాషలను నేర్చుకునేదానికి వీలుగా డ్యుయోలింగో యాప్‌ అనే కొత్త యాప్‌ను చేర్చాం. దానివల్ల పిల్లలు విదేశీభాషను నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ట్యాబు  పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్‌గా అన్ని రకాలుగా అండగా ఉంటుంది. 

ప్రపంచంలో మన పిల్లలే బెస్ట్‌ కావాలన్న తపనతో
మరో ముఖ్యవిషయం కూడా చెప్పాలి. పిల్లలందరూ ఆంధ్రరాష్ట్రంలో బెస్ట్‌గా చూడాలని కాదు నేను పోటీపడుతున్నది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నా పిల్లలు బెస్ట్‌గా ఉండాలని, చూస్తున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రాథమిక స్ధాయి.. అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చి టోఫెల్‌ పరీక్షకకు వాళ్లను సిద్ధం చేసేలా.. అమెరికాకు చెందిన టోఫెల్‌ నిర్వాహణా సంస్ధ ఈటీఎస్‌(ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌)తో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్‌ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్‌ కేటాయిస్తూ 3వతరగతి నుంచి ప్రతి క్లాసులోనూ టీచ్‌ చేస్తూ....  కరిక్యులమ్‌లో తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది.

టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా
మరో 15–20 సంవత్సరాల తర్వాత పరిస్థితుల వేగంగా మారుతున్నాయి. మారుతున్న పరిస్థితిలకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. టెక్నాలజీ మారుతుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్కువగా మన బ్రతుల్లోకి వస్తుంది. రానున్న 20 సంవత్సరాలలో మనం చేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయని చెప్తున్నారు. ఆ రకంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పెరుగుతుంది. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. 

మనంకూడా దీనికి అగుణంగా అడుగులు వేయాలి
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలనే ప్రిపేర్‌ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి 8వ తరగతి నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, వర్టువల్‌ రియాలటీ, అగ్‌మెంటెడ్‌ రియాలటీ, ఫైనాన్షియల్‌ లిటరసీ వంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా... వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును తీసుకువస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి  కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సబ్జెక్టులను ఎలా బోధించాలి ? ఎటువంటి ట్యూటర్లు కావాలన్న దిశగా ఆడుగులు పడుతున్నాయి. 

ఐబీ సిలబస్‌ దిశగా
విద్యారంగంలో భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్‌ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఈ సిలబస్‌ను తీసుకువస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగావకాశాలు పొందుతారు. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తూ ఐబీ సర్టిఫికేట్‌ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వస్తూ సంయుక్త సర్టిఫికెషన్‌ తీసుకువచ్చేలా మార్పులు.

ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి ? గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి ? మీ బిడ్డ అధికారంలోకి వచ్చి తర్వాత ఈ 55 నెలల కాలంలో మన స్కూళ్లు ఎలా ఉన్నాయో చూడాలని కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వ బడులు, పిల్లలకిచ్చే ట్యాబులు, నాడు నేడుతో బడుల బాగుమీద పెట్టే మనసు, పిల్లలకిచ్చే జగనన్న విద్యాకానుక మీద ఆరాటం కానీ, జగనన్న గోరుముద్ద మీద చూపిస్తున్న ధ్యాస కానీ, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లుల పిల్లలకు తోడుగా ఉండాలని, ఆ పిల్లల కోసం, తల్లుల కోసం ఆలోచన చేస్తూ  తీసుకొచ్చిన వైఎస్సార్‌ అమ్మఒడి పథకం కానివ్వండి.. పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగుమీడియం బడులను మార్చుతూ ఇంగ్లిషు మీడియం తీసుకునిరావడంతో పాటు పిల్లలకు పూర్తిగా అర్ధమయ్యేందుకు ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీ తెలుగు ఉండేలా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ తీసుకువచ్చాం. 

ప్రయివేటుబడులలో పెద్దవాల్లు, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా రూ.15వేలు ఏడాదికి ఖర్చుచేస్తే తప్ప అందుబాటులోకి రాని బైజూస్‌ కంటెంట్‌ను ఇవాళ మన పిల్లలకు ఇవ్వడం కానీ.. 6వతరగతి ఆపై తరగతులకు సంబంధించి  ప్రభుత్వ బడులలో ప్రతి తరగతిగదిని డిజిటలైజ్‌ చేస్తూ.. పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా చేస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు మారడంతో పాటు అదొక్కటే సరిపోదని సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం వరకు.. మంచి ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో ప్రతి స్కూల్‌లోనూ కనిపిస్తున్నాయి. 

ప్రభుత్వ బడులతో ప్రైవేట్‌ స్కూళ్లు పోటీపడే పరిస్థితి
ప్రైవేటు స్కూళ్లు గవర్నమెంట్‌ స్కూళ్లు కన్నా మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి.. ఇవాళ ప్రైవేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చిందా ? లేదా ? ప్రభుత్వ బడుల్లో బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పిలు ఏర్పాటు, 8వతరగతిలో ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబు అందించడం, నాడు నేడుతో మారుతున్న స్కూళ్లు వంటి కార్యక్రమాలు  చేయడంతో ప్రైవేటు బడులు వాటికోసం గవర్నమెంటు బడులతో పోటీపడే పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతుంది. జగన్‌ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారు. మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్ధి కోసం పెడుతున్నాం. రేపటి భవిష్యత్తుమీద ప్రతి పైసాకూడా పెడుతున్నాం. పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే. అది కూడా నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే.. వాళ్ల జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడే పేదరికం ఆటోమేటిక్‌గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. 

మన మీద దుర్బిద్ధితో బురద జల్లుతున్నారు
ఇలా పేదల పిల్లల చదువులు మీద దేశచరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం పెట్టనంత దృష్టి పెట్టి.. పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల కోసం మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద దుర్భిద్ధితో, దురుద్దేశంతో బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్‌ ఆరాటపడుతుంటే... మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబులు ఇవ్వొద్దని ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు.

అది పేపరా.. పేపరుకు పట్టిన పీడా
జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి, గాడితప్పుతున్న బైజూస్‌ ట్యాబ్‌ చదువులు, ఇతర వీడియోలు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్‌ సర్కార్‌ అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేపరుకు పట్టిన పీడా. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా. 

నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్లకు చెప్తున్నాను. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను. పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి అని చెప్తున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దండీ అని చెప్తున్నాను. మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్‌ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్‌ ఫోన్లు కూడా ఉండొచ్చు. కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్‌ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్‌ ఫోన్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని ప్రశ్నిస్తున్నాను. మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు, ల్యాప్‌టాపులు, స్మార్ట్‌ ఫోన్లు ఉంటే మాత్రం ఉంటే చెడిపోతారు.మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లిషు చదవకూడదు. పేదపిల్లలు ఇంగ్లిష్‌ మీడియం మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట?. 
కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు.

ఎంత మోసానికైనా వెనకడుగు వేయని దుష్టచతుష్టయం
ఈ రోజు మీరంతా ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్‌ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందని రాస్తారు. మరి జగన్‌ హయాంలో రాష్ట్రం అప్పులు పాలయిపోతుందంటారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అని చెపుతాడు. వాటిని వీళ్లు పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్‌ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. గతంలో 2014–19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇదే దత్తపుత్రుడు ఉన్నారు. ఆ రోజుల్లో రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. ఇంటింటికీ జాబు ఇస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి, అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.1లక్ష. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 వరకు ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. అవ్వాతాలనూ, రైతులను, పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసంచేశారు. చివరకు వారి మేనిఫెస్టోను ఎవ్వరికీ కనిపించకుండా.. ఇంటర్‌ నెట్‌లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమోనని దాన్ని నెట్లో నుంచి కూడా తీసేశారు.

ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగానూ, ఖురాన్‌గానూ, బైబిల్‌గానూ భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99.5శాతం వాగ్దానాలను అమలు చేశాం. ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ రోజు మీ బిడ్డ 55 నెలల పాలనలో మీ బిడ్డ  బటన్‌ నొక్కాతున్నాడు. రూ.2.40లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు. 
గతంలో పరిపాలన చేసిన వాళఅలు ఎందుక్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు. 

అప్పులు గురించి విమర్శిస్తున్నారు...
అప్పులు గురించి విమర్శలు చేస్తున్నారు. అప్పుల్లో పెరుగుదల అప్పటికన్నా.. ఈ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌ అప్పులు పెరుగుదుల అప్పటి కన్నా ఇప్పుడు తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు.

అప్పట్లో గజదొంగల ముఠా రాజ్యం...
కారణం అప్పట్లో ఒక గజదొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో ఇసుక నుంచి మొదలుకుని మద్యం, స్కిల్‌ స్కామ్‌ నుంచి పైబర్‌ గ్రిడ్‌ వరకు ఏది ముట్టుకున్నా దోచుకోవడం, దాన్ని పంచుకోవడం, తినుకోవడమే. 

ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు అందులో 22 ఇళ్ల లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగించగలుగుతున్నాడు, చంద్రబాబు హయాంలో జరగలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతుంది, గ్రామాలన్నీ మారి ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్ధ, ప్రతి  50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో వాలంటీర్‌ వ్యవస్ధ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీన సెలవైనా.. ఉదయాన్నే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ అవ్వా,తాతల చేతుల్లో పెన్షన్‌ ఎలా పెట్టగలుగుతున్నారో ఆలోచన చేయండి. 

రాబోయే రోజుల్లో ఇంకా బురద జల్లుతారు
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ఇంకా ఎక్కువ అబద్దాలు చెబుతారు. గుర్తుపెట్టుకొండి. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే మాత్రం.. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన ఉన్న దేవుడ్ని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. 
మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి. 
ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే... మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. జగన్‌ ట్యాబ్‌ మాత్రమే ఇచ్చాడు. మేం ఒక బెంజికారు ఇస్తామంటారు. దయచేసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను 

నా చెల్లెమ్మ కొన్ని పనులు మంజూరు చేయమని అడిగింది
 నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనుల మంజూరు కోసం అడిగింది. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కోసం అడిగింది. అన్నింటినీ యుద్ధప్రాతిపదినక మంజూరు చేసి, అడుగులు వేగంగా వేయిస్తాను. ట్రైబల్‌ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం కలిగించే మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో మొట్టమొదటసారిగా ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుంది. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో  మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయని మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement