వణికిన రాజమండ్రి
కంబాలచెరువు/రాజమండ్రి క్రైం : తొలిరోజు జరిగిన అపశృతి స్మృతుల్లో పచ్చిగా ఉండగానే.. పుష్కరపర్వంలో తొమ్మిదోరోజైన బుధవారం జరిగిన దుర్ఘటన పుష్కరకేంద్రం రాజమండ్రిని.. తుపానులో చిగురాకులా వణికించింది. యూత్రికులను భయ విహ్వలుల్ని చేసింది. ఆదిలోనే 29 మందిని బలిగొన్న పుష్కరఘాట్ తొక్కిసలాట విషాదం పుండులా సలుపుతున్నా.. గోదారమ్మపై అపారమైన భక్తిప్రపత్తులతో, పన్నెండేళ్లకోసారి వచ్చే పండుగ అన్న భావనతో రాజమండ్రి ఘాట్లకు భక్తులు ఇన్నిరోజులుగా పోటెత్తుతూనే ఉన్నారు.
వారిని భీతావహులను చేస్తూ బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో గోకవరం బస్టాండ్ సమీపంలోని జగదాంబ హోటల్‌లో పేలుడు సంభవించింది. అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ తెరపై సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది తిలకిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందిద. క్షణాల్లో పొగ, మంటలు వ్యాపించడంతో వేలాదిమంది ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి గుంటూరుకు చెందిన 70 ఏళ్ల వృద్దురాలు శారదాంబకు తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు జరిగిన హోటల్ ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లోని కిళ్లీ దుకాణం యజమాని గొర్రెల సుబ్రహ్మణ్యం, ప్రేమ్‌కుమార్‌లకు స్వల్పగాయాలయ్యాయి. అదే కాంప్లెక్స్‌లో పుష్కరాల సందర్భంగా చీపుర్లు, బ్లీచింగ్ నిల్వ ఉంచడంతో మంటలు మరింత పెరిగాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచిశకటాలు క్షణాల్లో వచ్చి మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో మున్సిపల్ కాంప్లెక్స్‌ను ఆనుకుని ఉన్న కిళ్లీదుకాణం సగంపైగా ధ్వంసంకాగా, లక్ష రూపాయలపైగా నగదు అగ్నికి ఆహుతైంది. అక్కడే ఉన్న ఐదు వాహనాలు పూర్తిగా, మూడు మోటారుసైకిళ్లు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. అప్పటికే అధికసంఖ్యలో అక్కడున్న పోలీసులు ప్రజలను దూరంగా పంపించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం అంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దీనిలో నష్టపోయిన దుకాణదారులకు, వాహనదారులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా దుర్ఘటన వివరాల సేకరణకు వచ్చిన మీడియాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారికి, మీడియా వారికి మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో వచ్చిన హోం మంత్రి చినరాజప్ప పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీడియా వారికి నచ్చజెప్పారు.
మళ్లీ సీఎం కోసమే జనాన్ని నిలిపేశారు..
సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశం కోసం నగరానికి వచ్చిన మంత్రులతో కలిసి గోదావరి హారతిని తిలకించేందుకు పుష్కర్‌ఘాట్‌లో ఉన్న సమయంలోనే అక్కడకు సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. అంతకు ముందే పోలీసులు పుష్కరఘాట్‌కు వెళ్లకుండా జనాలను పోలీసులు ఎక్కడిక్కడే నిలిపివేశారు. పేలుడు జరిగిన చోట ఆ సమయంలో భారీ సంఖ్యలో జనం ఉండడానికి, అనేక వాహనాలు నిలిచిపోవడానికి అదీ ఓ కారణం.
క్షతగాత్రులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
విస్ఫోటంలో గాయపడి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర్ పాలక సంస్థలో ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్రసేవాదళ్ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా జక్కంపూడి మాట్లాడుతూ ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. నగరంలోనే ఉన్న ముఖ్యమంత్రి నగర భద్రతను గాలికొదిలేసి సొంతప్రచారం కోసం జనాన్ని ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదన్నారు.
నా ఆటో కాలిపోరుుంది
పుష్కరాలకు వచ్చిన వారిని నా ఆటోలో అంబేద్కర్ విగ్రహం జంక్షన్ సమీపంలో దించి డబ్బులు తీసుకుంటున్నాను. ఇంతలో ఒక్కసారిగా నా ఆటోవైపు విపరీతమైన పొగ కమ్మి, పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. నేను, ఆటోలో ఉన్న ప్రయాణికులు ఆటోను వదిలి పరుగు తీశాము. నా ఆటో పూర్తిగా కాలిపోయింది.
- నటిగట్ల నాగరాజు, ఆటోడ్రైవర్, ప్రత్యక్షసాక్షి
మంటలు క్షణంలో వ్యాపించాయి
సంఘటన సమయంలో నేను అక్కడే నిల్చుని ఉన్నాను. మున్సిపల్ కాంప్లెక్స్‌లోంచి భారీ పేలుడుతో కూడిన మంటలు వచ్చాయి. అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. మంటల తాకిడికి విద్యుత్ వైర్లు కరిగి తెగిపోయూయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లో చీపుర్లు, ఇతర సామగ్రి నిల్వ ఉంచడంతో మంటలు మరింత పెరిగాయి.
- ఎంజీకే రాజు, ప్రత్యక్షసాక్షి
దేవుడే కాపాడాడు..
దుకాణం అంతా కస్టమర్లతో రద్దీగా ఉంది. వచ్చిన వారికి దుకాణంలో సామాన్లు ఇస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చి మంటలు చెలరేగారుు. నాపై కొన్ని వస్తువులు వచ్చి పడ్డాయి. దీంతో దుకాణంలోంచి బయటకు పారిపోయి వచ్చాం. ఆ దేవుడే నా ప్రాణాలను కాపాడాడు.
- గొర్రెల సుబ్రహ్మణ్యం, గాయపడ్డ కిళ్లీ దుకాణం యజమాని