
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ విషాదాంతం
⇒ పొన్నలూరులో పదో తరగతి విద్యార్థి హత్య కేసును పది రోజుల్లోపే ఛేదించిన పోలీసులు
⇒ ప్రియురాలి విషయంలోనే బాలుడిని అంతమొందించిన హంతకులు
⇒ పోలీసుల ఎదుట నేరం అంగీకరించిన యువకులు.. అరెస్టు
⇒ కేసు వివరాలు వెల్లడించిన కందుకూరు డీఎస్పీ శంకర్
కందుకూరు: ప్రేమ.. పెళ్లి.. అంటే సరిగ్గా అర్థం కూడా తెలియని వయసులో ఉన్న విద్యార్థి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ విషాదాంతమైంది. ప్రియురాలి ప్రేమను పొందేందుకు ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ చివరికి ఒకరి హత్యతో ముగిసిపోయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకరు మృత్యువాత పడితే.. మరోకరు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు.
డీఎస్పీ శంకర్ కథనం ప్రకారం.. మంగపతివారిపాలేనికి చెందిన సాధు కేశవ్‌కుమార్(16) తల్లిదండ్రులు బెంగళూరులో బేల్దారి పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేశవ్‌కుమార్ నాయనమ్మ, తాతల వద్ద ఉంటూ పొన్నలూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చవుతున్నాడు. పొన్నలూరుకే చెందిన సహ విద్యార్థినిని కేశవకుమార్ ప్రేమించాడు. వీరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పొన్నలూరులోనే ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ఎస్‌కే అల్లాబకాష్ అనే యువకుడు కూడా అదే విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. అల్లాబకాష్ ప్రేమను బాలిక తిర స్కరించింది.
విద్యార్థిని తనను ప్రేమించకపోవడానికి కేశవ్‌కుమారే కారణమని అల్లాబకాష్ పలుమార్లు బాలుడిని హెచ్చరించాడు. కేశవ్‌కుమార్ హత్యకు కుట్ర పన్నిన అల్లాబకాష్ స్నేహితుల సాయం కోరాడు. గత 15వ తేదీన ఇంటి నుంచి స్నేహితునితో కలిసి కేశవ్‌కుమార్ పాఠశాలకు బయల్దేరాడు. పాఠశాలకు వెళ్లకుండా అదే రోజు కొండపిలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఒంటరిగా వెళ్లాడు. తిరిగి బహిరంగసభ నుంచి సాయంత్రం పొన్నలూరు చేరుకున్నాడు.
అక్కడి నుంచి మంగపతివారిపాలేనికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుతుండగా అల్లాబకాష్‌తో పాటు ఆయన స్నేహితులు ఎస్‌కే మస్తాన్‌వలి, నాలి బాలకృష్ణలు ఆటోలో కేశవ్‌కుమార్‌ను వెంబడించారు. నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయిని వదిలేయాలని మళ్లీ బెదిరించారు. చివరకు ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టారు. కేశవ్‌కుమార్ గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారేమోననే అనుమానంతో నోటిలో గుడ్డలు పెట్టి మరింత బలంగా కొట్టారు. స్పృహ తప్పడంతో మోసుకుంటూ సమీపంలో ఉన్న గొరిసలేరులో ఉన్న నీటి కుంట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడే హత్య చేసి మృతదేహానికి రాళ్లు కట్టి కుంటలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి..
15వ తేదీ నుంచి కేశవ్‌కుమార్ కనిపించకపోవడంతో బెంగళూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు పలుచోట్ల విచారించారు. చివ రకు 19వ తేదీన పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. హంతకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కేశవ్‌కుమార్‌ని తామే హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ శంకర్ తెలిపారు.
మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేశామని, అలాగే మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. కేసును నాలుగు రోజుల్లో ఛేదించిన సీఐ ఎం.లక్ష్మణ్, కందుకూరు పట్టణ, పొన్నలూరు ఎస్సైలు వైవీ రమణయ్య, కె.ఆరోగ్యరాజ్, కానిస్టేబుళ్లు మహ్మద్, మాధవ, కిశోర్, నాగార్జున, మల్లీ, హోంగార్డులు చెన్నయ్య, అంజయ్యలను డీఎస్పీ అభినంధించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు వివరించారు.