గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం లేదు
జంగారెడ్డిగూడెం :నూతనంగా ఏర్పాటు చేసే గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలాన్ని విలీనం చేసే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గిరిజన జిల్లాలో కలిపే మండలాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అభిప్రాయ సేకరణ మాత్రమే చేపట్టారన్నారు. గిరిజన మండలాలతో మైదాన ప్రాంత మండలాలను కలిపే అవకాశం ఉండదని తెలిపారు. అలాకాకుండా జంగారెడ్డిగూడెంను గిరిజన జిల్లాలో కలపాల్సి వస్తే తప్పనిసరిగా కేబినెట్‌లో చర్చించాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో తామే ఆ ప్రతిపాదనలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు.
నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తాం
నామినేటెడ్ పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చినరాజప్ప చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తామని, అన్నివిధాలుగా వారిని ఆదుకుంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీలు, ఇతర నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇక్కడ నేర పరిశోధన స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరగా, దీనిపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు.
కోర్టు భవనాల పరిశీలన
శిథిలావస్థలో ఉన్న జంగారెడ్డిగూడెం కోర్టు భవనాలను ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం పరిశీలించారు. కోర్టు ఏర్పాటు చేసిన స్థలాన్ని ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని, దీంతో నిధులు ఉన్నప్పటికీ నూతన భవనాలు నిర్మించుకోలేక శిథిలావస్ధలో ఉన్న భవనాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గన్నమనేని శేఖర్, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, మాండ్రు మోహన్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు గదులను పరిశీలించిన మంత్రులు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉద్దండం ఏసుబాబు, కైకాల చంద్రశేఖర్, మాజీ బార్ అసోషియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు ఉన్నారు.
సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో రూ.5.45 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో చేపట్టే పైప్‌లైన్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.14.80 లక్షలతో అదనపు తరగతుల భవనాల నిర్మాణ పనులకు చినరాజప్ప శంకుస్థాపన చేశారు. తహిసిల్దార్ కార్యాలయం సమీపంలో టీటీడీ కల్యాణ మండపం వద్ద లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 63కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఆర్డీవో వి.మురళీమోహన్‌రావు, తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ వి.నటరాజన్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంఈవో డి.సుబ్బారావు, టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, నాయకులు షేక్ ముస్తఫా, రాజాన సత్యనారాయణ (పండు), దల్లి కృష్ణారెడ్డి, పెనుమర్తి రామ్‌కుమార్, అబ్బిన దత్తాత్రేయ, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ కె.అంబికాకృష్ణ పాల్గొన్నారు.