పార్వతీపురం : బుదురువాడ పంచాయతీ పరిధిలో ఉన్న బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతివ్వడంతో గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు భగ్గుమన్నారు. గ్రానైట్ తవ్వకాలకు అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. రైతు కూలీ సంఘం (ఆ.ప్ర), అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఎం, గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన సంఘ నాయకులు పి.శ్రీనునాయుడు, పి.రమణి, రెడ్డి శ్రీరామమూర్తి, ఊయక ముత్యాలు, వెలగాడ కృష్ణ, సాయిబాబు, పి.రంజిత్‌కుమార్ తదితరుల ఆధ్వర్యాన బోడికొండ గ్రానైట్ బాధిత గ్రామాల గిరిజనులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీడీఏ కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ దూసుకుని లోపలికి వెళ్లారు. ఆ సమయంలో సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్‌ఐ బి.సురేంద్రనాయుడు త దితరులతో వాగ్వాదానికి దిగారు. ఐటీడీఏ పీవో బయటకు రావాలని గిరిజనులు డిమాండ్ చేశారు. దీంతో తొలుత పీవో తన చాంబర్‌లో గిరిజనులు, గిరిజన సంఘ నాయకులతో మాట్లాడారు. ఆ తర్వాత గిరిజనుల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
20 గిరిజన గ్రామాలకు జీవనాధారం..
ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ తమకు అనుమతులు ప్రభుత్వం నుంచి వచ్చాయని చెబుతూ పోకర్నో గ్రానైట్ కంపెనీ తవ్వకాలకు యంత్రాలను సిద్ధం చేస్తోందని పీవోకు చెప్పారు.
బుదురువాడ పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 121లో సుమారు 200 ఎకరాల్లో ఉన్న బోడికొండపై ఆధారపడి 20 గిరిజన గ్రామాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ కొండ చుట్టూ వందలాది ఎకరాలలో జీడితోటలు, వరి, రాగులు, జొన్నలు, కొర్రలు తదితర పంటలు పండించుకుని వేలాది గిరిజనులు, గిరిజనేతరుల కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. కొండపై ఉన్న వెదురు, కలపను విక్రయించి కొందరు జీవిస్తున్నారని వివరించారు. ఈ కొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతిస్తే ప్రజలు జీవితం ఛిద్రమవుతుందన్నారు.
ప్రజలు నిరాశ్రయులవుతారని పేర్కొన్నారు. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దని గత ఏడాది పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామని గుర్తుచేశారు. అప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పోకర్నో కంపెనీ తమకు అనుమతులు ఉన్నాయని చెబుతోందన్నారు. పోకర్నో కంపెనీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు.
సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలి
పీవో వెంకటేష్ వెంటనే ఆర్డీవో రోణంకి గోవిందరావుతో మాట్లాడి బోడికొండపై సమగ్ర సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. ఆ రిపోర్టు అనంతరం తానే స్వయంగా పరిశీలించి ప్రభుత్వానికి విన్నవించి, అనమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటానని గిరిజనులకు హామీ ఇచ్చారు. గిరిజన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
భగ్గుమన్న గిరిజనులు
Published Tue, Jun 21 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement