ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా? | Triple IT 10th Classes in District | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా?

Published Wed, May 3 2017 3:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా? - Sakshi

ఈ ఏడాదైనా ప్రారంభమయ్యేనా?

ఎచ్చెర్ల క్యాంపస్‌: జిల్లాలో తప్పనిసరిగా ట్రిపుల్‌ ఐటీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రాష్ట్రంలోని కడప, నూజివీడు, శ్రీకాకుళం, ప్రకాశం ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో.. మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిసారించారు. కాగా, ఈ  ఏడాది జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ తరగతుల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

500 మందికి తరగతులు, వసతి ఎలా?
గత ఏడాది రాష్ట్రంలో రెండు ట్రిపుల్‌ ఐటీలను ప్రభుత్వం శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ తరగతులు వైఎస్సార్‌ జిల్లా (కడప)లో, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరగతులు కృష్ణా జిల్లా నూజివీడులో ప్రారంభించారు. శ్రీకాకుళానికి సంబంధించి ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకుల భవనాలు, 47 ఎకరాలతో పాటు మరో 23 ఎకరాలు ట్రిపుల్‌ ఐటీ సంస్థకి అప్పగించింది. మరోపక్క నూజివీడులో వసతి ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది ప్రవేశాలు పొందిన 1,000 మంది విద్యార్థులకు తరగతులు అక్కడే నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది ప్రవేశాలు జరిగే 1,000 మందికి మాత్రం ఇక్కడే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జూలైలో ప్రవేశాలు, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయి. దీంతో వీటిని ఏవిధంగా నిర్వహించాలన్న అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీకి ప్రభుత్వం కేటాయించిన భవన సముదాయాల్లో 500 మందికి వసతి, తరగతులు నిర్వహించవచ్చు. మరో 500 మందికి వసతి, సౌకర్యం ఎలా కల్పిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బందికి నివాసాలు వంటి సౌకర్యాలు కల్పించాలి.

ప్రభుత్వ సంస్థల్లో నిర్వహణకు నో
రాష్ట్ర ట్రిపుల్‌ ఐటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రరాజు, శ్రీకాకుళం డైరెక్టర్‌ పి.అప్పలనాయుడుతో కూడిన బృందం పలు అంశాలు పరిశీలిస్తోంది. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ అధికారులతో బృంద సభ్యులు భేటీ అయ్యారు. 500 మందికి వసతి, తరగతుల నిర్వహణకు ఏడాది పాటు భవనాలు అవసరమని వివరించారు. ప్రస్తుతం వర్సిటీ వసతి గృహంలో ఒకరు ఉండాల్సిన గదిలో నలుగురు ఉంటున్నారని, తరగతి గదుల సమస్య కూడా ఉందని వర్సిటీ అధికారులు వివరించారు. ఇక్కడ తరగతుల నిర్వహణ, వసతికి అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు కార్యాలయాన్ని పరిశీలించి, అక్కడి అధికారులతోనూ భేటీ అయ్యారు. తమ వద్ద సౌకర్యాలు కల్పన సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. దీంతో ఇక అద్దె భవనాలపై దృష్టిసారించారు.

నిధుల మంజూరుపై సందేహాలు
ప్రస్తుత ట్రిపుల్‌ ఐటీకి రెండు కిలోమీటర్ల దూరంలో చినరావుపల్లి వద్ద మిత్రా ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. మూతపడ్డ ఈ కళాశాలను లీజ్, అద్దెకు ఇచ్చేందుకు యాజమాన్యం సానుకూలంగా ఉంది. కానీ వసతి, తరగతుల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దాలంటే మరమ్మతులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ భవనాల మరమ్మతులకు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తుందా? లేదా? అన్నది అధికారుల సందేహం. మరోపక్క ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీలో ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement