సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ముసలం పుట్టిందా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టు దాటబోతున్నారా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే పార్టీ చీలబోతోందా?... తాజా రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. అవుననే సమాధానమే వస్తుం ది. టీఆర్‌ఎస్ విలీనం కాకపోయినా తామంతా అండగా ఉంటామంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ అధిష్టానానికి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తర్వాత కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని మంచిర్యాల శాసనసభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి ద్వారా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్‌కు రాయబారం పంపినట్లు సమాచారం.
‘‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన కారణం పూర్తయింది. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి కృతజ్ఞత చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయండి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం అంతా మీ వెంటనే ఉంటాం. ఇంకా గడువును పెంచొద్దు’’ అని దిగ్విజయ్ సింగ్‌కు ఎమ్మెల్యే జి.అరవింద్‌రెడ్డి వివరించినట్లు సమాచారం. ఊహించని ఈ భేటీ టీఆర్‌ఎస్‌ను షాక్‌కు గురిచేసిందని, కాంగ్రెస్ వైఖరిపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
తెలంగాణలోని 119 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలంగా... గెలుపు లేదా రెండో స్థానంలో ఉంది. కానీ టీఆర్‌ఎస్ ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి (రెండు స్థానాలు మినహా), నల్లగొండ (రెండు స్థానాలు మినహా) జిల్లాల్లో పోటీచేయడానికే అభ్యర్థులు లేరని చెబుతున్నారు.
అరవింద్‌రెడ్డి 4-5 రోజులుగా శాసనసభకు హాజరుకావడంలేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్ లాబీల్లో వ్యాఖ్యానించారు. విలీనంపై తొందర ఎందుకన్నట్టుగా పార్టీలో అనుకున్నామని ఆయన తెలిపారు.