
కొంగర్‌కలాన్‌లో ప్రగతి నివేదన సభకు తరలివెళుతున్న టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రగతి నివేదన మహాసభకు దారితీసింది. అభివృద్ధి, సంక్షేమ నినాదాల హోరు.. బతుకమ్మ పాటలు, బోనాల జాతరలు, పోతరాజుల విన్యాసాలు, దున్నపోతుల రంకెలు, చేతి వృత్తుల ప్రదర్శనల మధ్య టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభ నగర పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. రెండు రోజుల నుంచే గులాబీ వనాన్ని తలపించిన మహానగరం.. ఆదివారం ఉదయం చిరు జల్లులు కురుస్తున్నా భారీ పార్టీ జెండాలను చేతబూని కొంగరకలాన్‌కు తరలి వెళ్లారు. దీంతో దారుల వెంట బైక్ ర్యాలీలు, ప్రయాణాల్లో జై తెలంగాణ నినాదాలతో సందడి నెలకొంది. ఆర్టీసీ సర్వీసులను ప్రగతి నివేదన సభకే నడిపారు. దీంతో ప్రత్యేక పనులున్న జనాలు మాత్రమే బయటకు వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయడంతో బస్తీలు, కాలనీ సంఘాల నుంచి జనం భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు.
జన సమీకరణలో పోటాపోటీ
నగరం నుంచి మొత్తం మూడు లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అందుకు తగ్గట్టుగానే భారీ సమీకరణే చేయగలిగారు. ముఖ్యంగా శివారు నియోజకవర్గాలైన కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఉప్పల్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి జనం భారీగా ర్యాలీలు తీశారు. ఉప్పల్‌లో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగిరెద్దులు, వెదురు బుట్టలను ప్రదర్శిస్తూ ప్రదర్శన సాగితే, అంబర్‌పేటలో గీత, కుమ్మరి, రజక వృత్తులను ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో తరలివెళ్లారు. కంటోన్మెంట్‌లో ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కాచిగూడలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దున్నపోతుల ర్యాలీని ప్రారంభించారు.
సభ విజయవంతంపై నేతల సంతృప్తి
మహానగరం నుంచి ఆశించిన స్థాయిలో జరిగిన జన సమీకరణపై టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సంతృప్తి వక్తం చేశారు. మంత్రులు పద్మారావు, తలసాని, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, నాయకులు దానం నాగేందర్‌తో పాటు ఎమ్మెల్యేలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందించారు.