సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావును పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఆదివారం ప్రకటించారు. కేసీఆర్ శనివారం కేకేతో సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీపడుతున్న టీఆర్‌ఎస్.. అధికార కాంగ్రెస్, టీడీపీల కంటే ముందే తన అభ్యర్థిని ప్రకటించింది.
ఒక్కో రాజ్యసభ అభ్యర్థి ఎన్నిక కావాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేల (కోటా ఓట్లు) తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కానీ, టీఆర్ ఎస్‌కు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరికి తోడు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇటీవలే పార్టీలో చేరడంతో పాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తుండడంతో పార్టీ బలం 22కు చేరింది.
ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం, సీపీఐ (నలుగురు), బీజేపీ (నలుగురు) మద్దతు లభిస్తుందని టీఆర్‌ఎస్ నేతలు ఆశిస్తున్నారు.
ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరముండగా.. కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కొందరి నుంచి స్పష్టమైన మద్దతు కూడగట్టిన తర్వాతనే పోటీ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుస్తామన్న ధీమాతోనే తమ పార్టీ అభ్యర్థిని నిలుపుతున్నట్టు పార్టీ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ చెప్పారు.
మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తే పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని సీపీఐ, బీజేపీ నేతల్లో తర్జనభర్జన సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం నాలుగో స్థానం కోసం ఎవరినీ పోటీలోకి దింపకుండా చేయడానికే టీఆర్‌ఎస్ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించిందన్న కూడా వినిపిస్తోంది.
టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థి కేకే
Published Mon, Jan 27 2014 2:02 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement